బుద్ధి మార్చుకోని పాక్, ఐరాసాలో భంగపడిన దాయాది దేశం

అంతర్జాతీయంగా ఎన్నిసార్లు అభాసుపాలైనా పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవడం లేదు. తన వక్రబుద్ధితో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మరోసారి భంగపడింది పాకిస్తాన్. ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలన్న పాకిస్తాన్ కుట్రను ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు తిప్పికొట్టాయి.
ఉగ్రవాద దేశంగా ముద్రవేసుకున్న పాక్.. ఆ బురదను భారత్‌కు అంటించాలని కుట్ర చేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు మతం రంగుపులుముతూ, రాజకీయం చేయాలనుకుంది. ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారంటూ ఇద్దరు భారతీయులను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలని చివరి వరకు ప్రయత్నించింది. భారతీయుల్ని తీవ్రవాదులుగా చిత్రీకరించే ప్రయత్నంలో పరువు పోగొట్టుకుంది పాక్.
యూఎన్ 1267 (టువెల్ సిక్స్‌టీ సెవెన్) కమిటీ ముందు వేణుమాధవ్
డోంగారా, అజయ్ మిస్త్రీ అనే ఇద్దరు భారతీయులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు పాక్ ప్రయత్నించింది. విదేశాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న భారతీయులను తీవ్రవాదుల జాబితాలో చేర్చాలని ప్రయత్నం చేసింది. అయితే, ఈ ఆరోపణలను భద్రతా మండలి ముందు రుజువు చేయలేకపోయింది.
అసత్య ఆరోపణలు చేసిన పాకిస్థాన్ చర్యను భద్రతా మండలిలోని సభ్యదేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం అడ్డుకున్నాయి. పాక్ కుట్రలను తిప్పికొట్టిన భద్రతామండలి సభ్య దేశాలకు యూఎన్‌లోని భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి ధన్యవాదాలు తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన మసూద్ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా పేర్కొనడంలో భారత విజయం సాధించింది.
https://10tv.in/twins-cheat-godavarikhani-electricity-department-younger-brother-who-has-been-working-from-12-years-instead-of-elder-brother-job-in-peddapalli/
దీంతో పాకిస్తాన్ భారత్‌పై కక్షతో నిరాధార ఆరోపణలతో భారతీయులను తీవ్రవాదులుగా చిత్రీకరించే దుస్సాహసానికి ఒడిగట్టింది . పాక్ పన్నాగాలను గ్రహించిన అంతర్జాతీయ వేదికలు ఆ ప్రయత్నాలను తిప్పికొడుతూనే ఉన్నాయి. ఎన్నిసార్లు పరువు పోయినా పాక్ తీరులో మార్పు రావడంలేదు.