పాకిస్తాన్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.

pakistan
passenger train derailed in pakistan: పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పాకిస్థాన్ రైల్వేస్ ప్రకారం.. రైలు లాహోర్ నుంచి రావల్పిండికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాహోర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న షేక్‌పురాలోని కాలా షా కాకు వద్ద రైలులోని పది బోగీలు పట్టాలు తప్పాయి. ఈ సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి బయటకు వచ్చేందుకు పరుగులు పెట్టారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకొని.. రైలు బోగీల నుంచి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని అన్నారు. లాహోర్ నుంచి బయలుదేరిన 30 నిమిషాల తరువాత రైలు పట్టాలు తప్పింది.
పాకిస్థాన్ రైల్యే మంత్రి ముహమ్మద్ హనీఫ్ అబ్బాసీ సమాచారం అందిన వెంటనే రైల్వే సీఈవో, డివిజనల్ సూపరింటెండెంట్‌ను సంఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి ఏడు రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని రైల్వే మంత్రి ఆదేశించారు.
గత 15 రోజుల్లో ఇది మూడవ సంఘటన. జూలై 28న జరిగిన పేలుడు కారణంగా క్వెట్టాకు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మూడు బోగీలు పట్టాలు తప్పాయి, పాకిస్తాన్‌లోని ఆగ్నేయ సింధ్ ప్రావిన్స్‌లో ఒకరు గాయపడ్డారు. పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని జకోబాబాద్ వద్ద రైల్వే ట్రాక్‌ను లక్ష్యంగా చేసుకుని వరుస పేలుళ్లు జరిగిన తరువాత జూలై 17న జాఫర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.