Parle G Biscuit: 5 రూపాయల పార్లే జి బిస్కట్ ధర అక్కడ రూ.2వేలు.. కంటతడి పెట్టిస్తున్న ఓ తండ్రి దీనగాథ.. గాజాలో దయనీయ పరిస్థితులు..
ఈ బిస్కట్ అంటే నా చిన్న కూతురికి చాలా ఇష్టం. అందుకే.. ఈ చిన్న ప్యాకెట్ కోసం నేను సుమారు 2వేల 342 రూపాయల కంటే ఎక్కువ చెల్లించానని..

Parle G Biscuit: పార్లే-జి బిస్కట్ అంటే తెలియని వారు ఉండరు. మన దేశంలో చాలా ఫేమస్. చిన్న, పెద్ద అనే తేడా లేదు. ధనిక, పేద అనే డిఫరెన్స్ కూడా లేదు. అందరూ ఇష్టపడే బిస్కట్ ఇది. ధర కేవలం 5 రూపాయలే. దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే బడ్జెట్ బిస్కట్. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బిస్కెట్ బ్రాండ్లలో పార్లె జి ఒకటి.
ఇండియాలో కేవలం 5 రూపాయలకే దొరికే పార్లే-జి బిస్కెట్లు యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో ఖరీదైన విలాసవంతమైన వస్తువుగా మారాయి. భారత్ లో సాధారణంగా రూ.5 ధర ఉండే బిస్కెట్ ప్యాక్.. అక్కడ ఏకంగా రూ.2వేల 300 కంటే ఎక్కువ రేటు పలుకుతోంది. ఈ విషయాన్ని ఓ పాలస్తీనియన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించాడు. పార్లే జి బిస్కెట్ ధరతో పాటు గాజాలో ఉన్న ఆహార సంక్షోభం గురించి ఆ తండ్రి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
మన దగ్గర అందరికీ అందుబాటులో ఉండే పార్లే జి బిస్కట్.. యుద్ధంతో దెబ్బతిన్న గాజాలో విలాసవంతమైన వస్తువుగా మారింది. గాజాలో నివసిస్తున్న పాలస్తీనియన్ మహ్మద్ జావాద్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. యుద్ధం కారణంగా అక్కడ నెలకొన్న పరిస్థితులు, ఆహార పదార్ధాల కొరత వంటి వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.
అతడు పెట్టిన వీడియోలో.. అతని చిన్న కూతురు పార్లే-జి బిస్కెట్ ప్యాక్‌ను పట్టుకుని ఉండటం చూడొచ్చు. ఈ బిస్కట్ అంటే నా చిన్న కూతురికి చాలా ఇష్టం. అందుకే.. ఈ చిన్న ప్యాకెట్ కోసం నేను సుమారు 2వేల 342 రూపాయల కంటే ఎక్కువ చెల్లించానని జావాద్ వెల్లడించాడు. దీని ధర సాధారణంగా భారతీయ మార్కెట్ లో 5 రూపాయలు. అంతర్జాతీయ కిరాణ దుకాణాలలో 100 రూపాయల కంటే తక్కువే. కానీ, గాజాలో మాత్రం 2వేలు చెల్లించాల్సిందే. ఇది గాజాలో తీవ్రమైన ఆహార సంక్షోభానికి అద్దం పడుతోంది. ధర పెరిగినా నా కూతురికి ఇష్టమైన ట్రీట్ ని నేను కాదనలేకపోయాను అని ఆ తండ్రి చెబుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.
Also Read: భూమి అంతం కాబోతుందని హెచ్చరించిన ఎలాన్ మస్క్.. ఆ గ్రహమే మానవాళి జీవనానికి సురక్షితమట..
జావాద్ పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారత నెటిజన్లు దీన్ని ప్రభుత్వ అధికారులకు, పార్లే జి కంపెనీకి ట్యాగ్ చేస్తున్నారు. వారికి సాయం చేయాలని కోరుతున్నారు. నిజానికి.. పార్లే జి బిస్కెట్లను భారత్.. మానవతా కోణంలో పాలస్తీనియన్లకు ఉచితంగా పంపింది. కానీ సహాయ ట్రక్కులను హమాస్ స్వాధీనం చేసుకుంది. ఆకలితో ఉన్న పాలస్తీనియన్లకు ఆహారం, మందులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారు. అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
“గాజా ప్రజలకు వచ్చే సాయం న్యాయంగా పంపిణీ చేయబడుతుందని కొందరు భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే, ఈ సహాయాన్ని దొంగిలించడానికి , మార్కెట్లో అధిక ధరలకు విక్రయించడానికి చాలా మంది ఏజెంట్లను, దొంగలను నియమించారు. ఉదాహరణకు, పిండిని దాదాపు 500 డాలర్లకి అమ్ముతారు. కేజీ చక్కెరను దాదాపు 90 డాలర్లకి విక్రయిస్తారు. నిత్యవసర వస్తువులను భారీ ధరలకు అమ్ముకుంటారు. అంత డబ్బు పెట్టి కొనలేని కొందరు వ్యక్తులు తమకు అవసరమైన వాటిని పొందడానికి తమ ప్రాణాలను పణంగా పెడతారు. మరికొందరు పెద్ద దొంగతనాలు చేసి భారీ లాభాల కోసం మార్కెట్ లో అమ్ముకుంటారు” అని మహ్మద్ జావాద్ వాపోయాడు.
ఈ అసాధారణ ధరల పెరుగుదల గాజాలో జరుగుతున్న మానవతా విపత్తుకు నిదర్శనం. మార్చిలో కాల్పుల విరమణ ఒప్పందం రద్దైంది. అప్పటి నుంచి పాలస్తీనాలోకి ప్రవేశించే సాయాన్ని ఇజ్రాయల్ పూర్తిగా దిగ్బంధించింది. దీంతో ఆహార పదార్ధాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.
ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, గాజాలో ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం రేటు ఫిబ్రవరి నుండి దాదాపు 3 రెట్లు పెరిగింది. మే చివరలో దాదాపు 50వేల మంది పిల్లలకు పరీక్షలు చేయగా.. 5.8 శాతం మంది తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది. కొన్ని వారాల క్రితం ఇది 4.7 శాతంగా ఉంది.
ఆహారం కోసం ప్రయత్నిస్తూ పెద్ద సంఖ్యలో పౌరులు చనిపోతున్నారు. గాజాలోని డాక్టర్లు రోగులకు చికిత్స చేయడానికి సొంత రక్తాన్ని దానం చేస్తున్నారని అంతర్జాతీయ వైద్య స్వచ్ఛంద సంస్థ డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ (MSF) వాపోయింది. గత నెలలో కేవలం కొన్ని రోజుల్లోనే కనీసం 29 ఆకలి సంబంధిత మరణాలు సంభవించాయి. చనిపోయిన వారిలో ఎక్కువగా పిల్లలు, వృద్ధులు ఉన్నారు. దీనంతటికి కారణం ఆహార పంపిణీ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇజ్రాయల్ ఆంక్షలు, సాయంగా వచ్చిన వస్తువులను హమాస్ ఎత్తుకెళ్లడం.
After a long wait, I finally got Ravif her favorite biscuits today. Even though the price jumped from €1.5 to over €24, I just couldn’t deny Rafif her favorite treat. pic.twitter.com/O1dbfWHVTF
— Mohammed jawad 🇵🇸 (@Mo7ammed_jawad6) June 1, 2025