కోట్లాది మంది ప్రైవసీ డేంజర్‌లో : కొత్త ఫోన్ నెంబర్ కావాలా? మీ Face స్కానింగ్ తప్పనిసరి!

కొత్త మొబైల్ నెంబర్ తీసుకుంటున్నారా? ఇకపై ఎలాంటి డాక్యుమెంట్లు అక్కర్లేదు. మీ ఫేస్ స్కానింగే మీ ప్రూఫ్ డాక్యుమెంట్. కొత్త ఫోన్ నెంబర్ తీసుకునే వారంతా తమ ఫేస్ స్కానింగ్ చేయించుకోవడం తప్పనిసరి కానుంది. లేదంటే.. టెలికం కంపెనీలు కొత్త ఫోన్ నెంబర్ జారీ చేయవు. మనదేశంలో కాదండోయ్.. పక్క దేశమైన చైనాలో. ఇప్పటివరకూ పబ్లిక్ సంబంధిత విషయాలపై మాత్రమే ఫేస్ రికగ్ నైజేషన్ స్కానింగ్ ఉండేది. సాధారణంగా పబ్లిక్ ఇంటర్నెట్ వాడే వినియోగదారులు తమ గుర్తింపు కార్డుతో వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇంటర్నెట్ సర్వీసును వినియోగించుకోవడం జరుగుతుంది.
దేశ పౌరులపై చైనా నిఘా :
ఇంటర్నెట్ వాడకంపై ఫేషియల్ రికగ్ నైజేషన్ సిస్టమ్స్ సాయంతో ఎప్పటికప్పుడూ తమ దేశ ప్రజలపై చైనా ఓ కన్నేసి ఉంచుతోంది. అలాంటి చైనా ప్రభుత్వం ఫేస్ రికగ్నైజేషన్ స్కానింగ్ అనే కొత్త రూల్ తీసుకురాబోతోంది. దీంతో బిలియన్ల మంది దేశ పౌరుల ప్రైవసీకి ముప్పు వాటిల్లుతుందనే ఆందోళన నెలకొంది. కొత్త మొబైల్ నెంబర్ తీసుకునేవారికి ఈ కొత్త రూల్ వర్తించనుంది. అంటే.. కొత్త మొబైల్ నెంబర్ తీసుకునేవారంతా ముందుగా తమ ఫేషియల్ స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ తీసుకునే వారిందరిని తమ నిఘాలో ఉంచుకునేందుకు చైనా ప్రభుత్వం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్ :
అందిన రిపోర్టు ప్రకారం.. చైనాలోని మినిస్టరీ అఫ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MIIT) వచ్చే డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానుంది. మొబైల్ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థి తమ ఫేషియల్ రికగ్ నైజేషన్ డేటాను తప్పనిసరిగా టెలికం సర్వీసు ప్రొవైడర్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ డేటా ఆధారంగానే దరఖాస్తుదారుడి ఐడీ కార్డును వెరిఫై చేయడం జరుగుతుంది.
దీనికి సంబంధించి సెప్టెంబర్ 27న MIIT ఆదేశాలు జారీ చేసింది. సైబర్ ప్లా్ట్ ఫాంపై పౌరుల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఇంటర్నెట్ మోసాల పరిమితిని తగ్గిస్తుంది. ఇది ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో దేశంలో ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరుస్తుందని MIIT పేర్కొంది. ఫోన్ వినియోగదారులు తమ నెంబర్లను ఇతరులతో పంచుకోవడాన్ని కూడా నిషేధించనున్నారు. తమ అనుమతి లేకుండా తమ పేరు కింద ఫోన్ నెంబర్లను నమోదు చేశారో లేదో వెరిఫై చేసుకునేందుకు ప్రోత్సహించనున్నారు.
జియోతోనే బయోమెట్రిక్ ఆరంభం :
తన పౌరులకు సిమ్ కార్డులను జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటాను వినియోగిస్తున్న ఏకైక దేశం చైనా మాత్రమే కాదు. భారత్ లోనూ ఆధార్ కార్డుతో పాటు సేకరించిన యూజర్ల వేలిముద్రల ఆధారంగా సిమ్ కార్డులను అందజేస్తున్నారు. క్రొత్త సిమ్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పుడు, అన్ని టెలికాం ఆపరేటర్లు చిరునామా, ఐడిలతో పాటు వేలిముద్ర స్కాన్ (ఫోన్‌కు అనుసంధానించబడిన చిన్న స్కానర్‌పై) అడుగుతారు.
IDలో చూపిన విధంగా దరఖాస్తుదారుడు అదే వ్యక్తి కాదా అని ఇది ధృవీకరిస్తుంది. ఇది దేశంలో ముందుగా జియోతోనే ప్రారంభమైంది. ఇది 2016 సెప్టెంబరులో డేటా ఆఫర్లు అందించడంతో ఆసక్తి గల యూజర్లు వెళ్లి వారి బయోమెట్రిక్ సమాచారం ఇచ్చారు. చైనాతో పోలిస్తే ఇండియాలో పరిస్థితులు దారుణంగా లేవని చెప్పాలి. మన దేశంలో మన వ్యక్తిగత బయోమెట్రిక్ సమాచారం ఒక డేటాబేస్‌తో అనుసంధానమై ఉంది. అయినప్పటికీ గతంలో పౌరుల ఆధార్ డేటా బహిర్గతం కావడం అప్పట్లో ఆందోళన రేకిత్తించిన విషయం తెలిసిందే.