Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‭లో వెల్లువెత్తుతున్న నిరసన.. నెట్టింటా హల్‭చల్

వీడియో సందేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘‘నిజమైన స్వేచ్ఛ కోసం బయటకు రావాలని నా మద్దతుదారులను కోరుతున్నాను. నా అరెస్టుతో ఈ దేశం నిద్రపోతుందని వారు (అధికారంలో ఉన్నవారు) భావిస్తున్నారు. అది తప్పని మీరు నిరూపించాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను మీకోసం యుద్ధం చేస్తున్నాను. నా జీవితమంతా ఈ పోరాటం చేస్తాను’’ అని అన్నారు.

Imran Khan Arrest: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‭లో వెల్లువెత్తుతున్న నిరసన.. నెట్టింటా హల్‭చల్

Updated On : May 9, 2023 / 7:19 PM IST

Imran Khan Arrest: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ మీద ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. పాకిస్తాన్‭లోని కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇక ఖాన్ అరెస్టుపై సోషల్ మీడియాలో సైతం తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ప్రపంచ ట్విట్టర్ ట్రెండులో ఇమ్రాన్ ఖాన్ (#ImranKhan) అనే హ్యాష్‭ట్యాగ్ టాపులో ఉంది. ఇమ్రాన్‭ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న వీడియోలను ఫొటోలను షేర్ చేస్తూ ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు.

కాగా, తోషాఖానా కేసులో తనను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఈ జమాన్ పార్కులో ఉన్న ఆయన నివాసానికి చేరుకోక ముందే ఇమ్రాన్‭ ఒక వీడియో సందేశాన్ని రికార్డు చేశారు. అరెస్ట్ అనంతరం ఆయన పార్టీ అయితే తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ నేతలు ఆ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక పోలీసుల కంటే ముందే ఆయన నివాసానికి ఆయన మద్దతుదారులు, పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించారు.

ఈ క్రమంలో పోలీసులకు పీటీఐ కార్యకర్తలకు మధ్య భారీ తోపులాట జరిగింది. ఇమ్రాన్ మద్దతుదారులను చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు, వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. ఈ చర్యలో అనేక మంది గాయపడ్డారు. అనంతరం పోలీసులపై పీటీఐ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. విదేశాల నుంచి ఇమ్రాన్ అందుకున్న ఖరీదైన బహుమతులను లాభాల కోసం విక్రయించారని బలమైన ఆరోపణల నేపథ్యంలో తాజా అరెస్ట్ చోటు చేసుకుంది.

వీడియో సందేశంలో ఇమ్రాన్ మాట్లాడుతూ ‘‘నిజమైన స్వేచ్ఛ కోసం బయటకు రావాలని నా మద్దతుదారులను కోరుతున్నాను. నా అరెస్టుతో ఈ దేశం నిద్రపోతుందని వారు (అధికారంలో ఉన్నవారు) భావిస్తున్నారు. అది తప్పని మీరు నిరూపించాలి. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నేను మీకోసం యుద్ధం చేస్తున్నాను. నా జీవితమంతా ఈ పోరాటం చేస్తాను’’ అని అన్నారు.

కాగా మంగళవారం ఉదయం పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి రాణా సనావుల్లా స్పందిస్తూ ఇమ్రాన్ ఖాన్‌ను ఈ రాత్రి అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. ఈ కేసులో జారీ చేసిన అరెస్ట్ వారెంట్లపై పీటీఐ ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. ఖాన్ తరపు న్యాయవాది అలీ బుఖారీ ప్రకారం, మంగళవారం విచారణ జరపాలన్న పార్టీ అభ్యర్థనను తోసిపుచ్చుతూ చీఫ్ జస్టిస్ అమర్ ఫరూక్ బుధవారం (మార్చి 15) విచారణ చేస్తామని స్పష్టం చేశారు.