అంటార్కిటికాలా మారిన అమెరికా

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2019 / 03:19 AM IST
అంటార్కిటికాలా మారిన అమెరికా

Updated On : January 31, 2019 / 3:19 AM IST

అమెరికా గడ్డకట్టుకుపోయింది. అంటార్కిటికానా..అమెరికానా అని అనుకోవాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ లేని విధంగా శీతల గాలులు అమెరికాను వణికిస్తున్నాయి. ఆర్కిటిక్ కంటే తక్కువకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.పోలార్ వొర్టెక్స్ కారణంగా ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న గాలులతో అనేక రాష్ట్రల్లో ఉష్ణోగ్రతలు-53 డిగ్రీల సెల్సియస్ కి పడిపోయాయి. అనేక చోట్ల సరస్సులు, నదులు గడ్డకట్టాయి. మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు చోట్ల విమానాలు రద్దు అయ్యాయి. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇళ్లు వదిలి ఎవరూ ఒయటకు రావొద్దని ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

పోలార్ వొర్టెక్స్ అంటే ఏమిటి?
ఇదొక అతి శీతల వాతావరణ పరిస్థితి. ఉత్తర, దక్షిణ ధ్రువాల నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి. 5నిమిషాల్లోనే శరీరం సహజ ఉష్ణోగ్రతను కోల్పోయి మొద్దుబారిపోతుంది. ప్రాణాలు కూడా పోవచ్చు. సెల్సియస్ డిగ్రీ కొలమానంలో మైనస్ 32 దగ్గరనే శరీరం గడ్డ కట్టేస్తుంది. అలాంటిది పలుచోట్ల -50వరకు ఉంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చు. 5ఏళ్ల తర్వాత ఉత్తర అమెరికాపై పోలార్ వొర్టెక్స్ ప్రభావం కన్పిస్తోంది. దీని ప్రభావం సెప్టెంబర్ నుంచి మొదలయ్యి డిసెంబర్, జనవరిలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపిస్తుంది.

అమెరికాలో నెలకొన్న వాతావరణ పరిస్థితులు ఉత్తర భారతంపైనా ప్రభావితం చూపిస్తున్నాయి. ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చలిగాలులే దీనికి కారణమని ఐఎండీ అధికారులు తెలిపారు. ఆర్కిటిక్ గాలులు పశ్చిమ అవాంతరాలను సాధారణం కంటే ఎక్కువగా దక్షిణ దిశగా నెడుతుండటంతో దక్షిణ ఐరోపా నుంచి ఉత్తర భారతంవైపు చలి గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు.