Kazakhstan Plane Crash : కజకిస్థాన్‌‌లో కుప్పకూలిన రష్యా విమానం.. 30మందికిపైగా దుర్మరణం.. ప్రాణాలను అర్పించి 32 మందిని కాపాడిన పైలట్..!

Kazakhstan Plane Crash : అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కుప్పకూలింది. కజకిస్తాన్‌లోని అక్టౌ సమీపంలో కుప్పకూలడంతో 30 మందికి పైగా దుర్మరణం చెందారు.

Kazakhstan Plane Crash : కజకిస్థాన్‌‌లో కుప్పకూలిన రష్యా విమానం.. 30మందికిపైగా దుర్మరణం.. ప్రాణాలను అర్పించి 32 మందిని కాపాడిన పైలట్..!

Updated On : December 25, 2024 / 7:30 PM IST

Kazakhstan Plane Crash : కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అక్టౌ నగరంలో బుధవారం (డిసెంబర్ 25) అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ రష్యాకు వెళ్తుండగా విమానం కుప్పకూలింది. ఈ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా గాలిలో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 62 మందిలో 30మందికి పైగా మరణించినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో మరో 32 మంది ప్రాణాలతో బయటపడ్డారు. విమానం కూలిపోయిన సమయంలో తీసిన వీడియో, ఫొటోల ఆధారంగా పైలట్‌ ధైర్యం, తెలివితేటలు ప్రదర్శించకపోతే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేది. ప్రాణాలను సైతం అర్పించి పైలట్ కొంతమంది ప్రయాణికుల ప్రాణాలను రక్షించాడు. లేదంటే.. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది.


అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ J2-8243 బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీకి వెళ్తోందని, అయితే గ్రోజ్నీలో పొగమంచు కారణంగా దారి మళ్లించిందని రష్యన్ వార్తా ఏజెన్సీలు తెలిపాయని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.

విమానంలో 110 మంది వరకు ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని కజఖ్ మీడియా మొదట నివేదించింది. ఆ తరువాత అధికారులు సంఖ్యను 72 లేదా 67 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉన్నారని తెలిపారు. కానీ, ఆపై 67 మంది నుంచి 62 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందికి సవరించారు.

ప్రమాదం తర్వాత రెస్క్యూ పనిలో నిమగ్నమైన సిబ్బంది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘కజాఖ్స్తాన్‌లో విమాన ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ బృందాల ఫుటేజీ, పైలట్ వేగంగా విమానాన్ని కంట్రోల్ చేస్తుండటం కనిపిస్తోంది.

ల్యాండింగ్‌కు ముందు పైలట్ ఎలాగోలా విమానంలోని ఇంధనాన్ని ఖర్చు అయ్యేలా చేశాడు. తద్వారా విమానం ఇంధన ట్యాంక్‌లో పెద్ద పేలుడును నివారించాడు. పైలట్ సాహసోపేత చర్యతో విమానంలో ఉన్న 62 మందిలో దాదాపు సగం మంది ప్రాణాలను కాపాడింది.

రష్యా వెళ్తుండగా ప్రమాదం :
విమానంలో పేలుడు జరగకుండా ఇంధనాన్ని హరించాలని నిర్ణయించుకుని ప్రయాణికుల కాపాడిన పైలట్ ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు. రష్యా వార్తా సంస్థ ప్రకారం.. ఇద్దరు పైలట్లు ప్రమాదంలో మరణించారు. ప్రమాదానికి గురైన అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం నంబర్ J2-8243 అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోజ్నీ వైపు వెళుతోంది.

విమానంలో 62 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నారు. కజకిస్థాన్‌లోని అక్టౌ నగరం సమీపంలో విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న వారిలో ఎక్కువ మంది అజర్‌బైజాన్‌కు చెందిన ప్రయాణికులే ఉన్నారు. విమానంలో రష్యా, కజకిస్థాన్‌, కిర్గిస్థాన్‌కు చెందిన ప్రయాణికులు కూడా ఉన్నారు.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దట్టమైన పొగమంచు కారణంగా విమానాన్ని దారి మళ్లించినట్లు సమాచారం. ప్రమాదానికి ముందు కొన్ని ఫుటేజీలలో, విమానం ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన వెంటనే అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 32 మంది తృటిలో తప్పించుకున్నారు.

Read Also : Ola Electric MoveOS 5 : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో MoveOS 5 కొత్త ఫీచర్లు.. దేశవ్యాప్తంగా 4వేల స్టోర్లు..!