Sarah McBride: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌.. ఎవ‌రిపై గెలిచిందో తెలుసా..

డెలవేర్ లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

Sarah McBride: అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండ‌ర్‌.. ఎవ‌రిపై గెలిచిందో తెలుసా..

Sarah McBride

Updated On : November 6, 2024 / 11:59 AM IST

US Elections Results: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. మరికొద్ది సేపట్లో అధికారికంగా ట్రంప్ విజయంపై క్లారిటీ రానుంది. ఇదిలాఉంటే డెలవేర్ లోని ఎట్ లార్జ్ హౌస్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన సారా మెక్‌బ్రైడ్ విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ కు ఎన్నికైన తొలి ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె వయస్సు 34ఏళ్లు. డెలావేర్ రాష్ట్ర సెనేటర్ గానూ పనిచేశారు. 2010 నుంచి డెలవేరియన్ ఓటర్లు డెమోక్రట్ లకే మద్దతిస్తున్నారు. తాజా ఎన్నికల్లో సారాకు 57.7శాతం (2,83,590 ఓట్లు) పోలవగా.. రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన జాన్ వేలెన్ కు 42.3 శాతం (2,07,918 ఓట్లు) పోలయ్యాయి.

Also Read: US Elections 2024: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతలు రాజా కృష్ణమూర్తి, సుహాస్ విజయం

సారా మెక్‌బ్రైడ్ ఎల్జీబీటీక్యూ జాతీయ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు మూడు మిలియన్లకు పైగా ప్రచార విరాళాలు సేకరించారు. అయితే, సారా మెక్‌బ్రైడ్.. 2016లో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆమె 2016 డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ లో ప్రసంగిస్తూ.. ఒక ప్రధాన పార్టీ సమావేశంలో ప్రసంగించిన మొదటి బహిరంగ లింగమార్పిడి వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2020లో డెలవేర్ లో తొలి ట్రాన్స్ స్టేట్ సెనెటర్ గా వ్యవహరించారు.

 

తాజాగా విజయంపై సారా మెక్‌బ్రైడ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తాను కాంగ్రెస్ లో చరిత్ర సృష్టించడానికి పోటీ పడలేదని, డెలవేర్ లో మార్పు కోసమే పోటీ చేసినట్లు చెప్పారు. నాకు ఓటు వేసిన అందరికీ ధన్యవాదాలు.. మీ ఓట్లు, మీ విలువల కారణంగా మీ తదుపరి కాంగ్రెస్ సభ్యుడిగా నేను ఎన్నికైనందుకు గర్వపడుతున్నానని అన్నారు.