4 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన “జూలుతో ఉండే ఏనుగులు” మళ్లీ పుడతాయా? శాస్త్రవేత్తలు ఏం సాధించారంటే?
వూల్లీ మామ్మత్ అప్పట్లో అధికంగా మంచు ప్రదేశాల్లో నివసించేది.

Woolly mammoth
ప్రాచీన కాలంలో మంచు యుగంలో జీవించిన వూల్లీ మామ్మత్‌ను మళ్లీ పునః సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వూలీ మమోత్ అంటే భారీ ఆకారంతో, జూలుతో ఉండే ఏనుగు. దాని తొండం నుంచి తోక వరకు రోమాలతో ఉంటుంది.
వూల్లీ మామ్మత్ అప్పట్లో అధికంగా మంచు ప్రదేశాల్లో నివసించేది. ప్రధానంగా యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా ప్రాంతాల్లో జీవించి ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ప్రస్తుతం ఉన్న ఏనుగుల్లా ఉన్నప్పటికీ కొంచెం పొట్టిగా, బరువుగా ఉండేవి. దాదాపు 4 వేల ఏళ్ల క్రితం వూల్లీ మామ్మత్‌లు అంతరించిపోయాయి.
వీటిని పునః సృష్టి చేసేందుకు ప్రస్తుతం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా కొలోస్సల్ బయోసైన్సెస్ శాస్త్రవేత్తలు ఉత్తర ధ్రువ ప్రాంతపు మంచులో లభ్యమైన వాటి అవశేషాల్లోని జన్యువులను, ఇప్పుడున్న ఆసియన్ ఏనుగుల జన్యువులను పోల్చి చూశారు. అప్పటి కాలపు మమోత్‌లలో దట్టమైన వెంట్రుకలకు కారణమైన జన్యువులను శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇందుకు సంబంధించి మొదట ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు. అంతరించిపోయిన వాటిని పునః సృష్టించగలమనేందుకు ఈ ఎలుకలు సజీవ సాక్ష్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ టెక్నాలజీతో ఫ్యూచర్‌లో వూలీ మమోత్‌లను పుట్టిస్తామని చెబుతున్నారు.
ఎలుక పిండానికి చెందిన కణాలను తీసుకుని ప్రయోగాలు చేశామని, వాటిలో చర్మం, వెంట్రుకలు, వంటి లక్షణాలను కంట్రోల్ చేసే ఎనిమిది జన్యువుల్లో మమోత్‌ల జన్యువుల తరహాలో మార్పులు చేశామని తెలిపారు. ఈ జన్యుమార్పిడి చేసిన పిండ కణాలను పలు ఎలుకల గర్భంలో ప్రవేశపెట్టామని అన్నారు. దీంతో రోమాలలో నిండిపోయిన అతి శీతల వాతావరణాన్ని సైతం తట్టుకోగలిగే ఊలు ఎలుకలు పుట్టినట్లు చెప్పారు.