New Fish Found: మాల్దీవుల కోరల్ రీఫ్ మాటున కొత్త చేపను గుర్తించిన శాస్త్రవేత్తలు
మాల్దీవుల్లోని పగడపు దిబ్బలలో ఓ కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని నామకరణం చేసిన ఈ చేప గులాబీ-రంగు పులుముకుని ఎంతో అందంగా ఉంది.

Fish
New Fish Found: సముద్ర గర్భంలో ఎన్నో జీవజాతులు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించినవి కొన్ని మాత్రమే ఉంటే.. ఇంకా వెలుగులోకి రాని మరెన్నో జాతులు సముద్రంలో దాగి ఉన్నాయి. ఇటీవల మాల్దీవుల్లోని పగడపు దిబ్బలలో ఓ కొత్త జాతి చేపను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇంతవరకు చూడని అత్యంత అందమైన రంగురంగుల చేపగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని నామకరణం చేసిన ఈ చేప గులాబీ-రంగు పులుముకుని ఎంతో అందంగా ఉంది. వాస్తవానికి ఈ చేపను మొట్టమొదటగా 1990 లలో గుర్తించారు. అయితే ఆ సమయంలో అది సిర్రిలాబ్రస్ రుబ్రుస్క్వామిస్ అనే జాతికి చెందిన వయసుమీరిన చేపగా భావించారు. అయితే ఇటీవలి అధ్యయనంలో “సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా” చేపలే ఒక ప్రత్యేక జాతిగా గుర్తించారు. దాని రంగులు, పరిమాణం మరియు ప్రమాణాలను గమనించిన శాస్త్రవేత్తలు ఈ జాతి చేపలు గతంలో ఎన్నడూ గుర్తించబడలేదని పేర్కొన్నారు. ఈ కొత్త జాతులను గుర్తించడం ద్వారా సముద్ర జీవుల పరిరక్షణ మరియు జీవవైవిధ్య నిర్వహణకు ఎంతో దోహదపడుతుందని యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ డాక్టోరల్ విద్యార్థి యి-కై టీ వివరించారు.
Also read: Chhattisgarh CM: దేశంలోనే తొలిసారిగా ఆవు పేడతో తయారు చేసిన బ్రీఫ్‌కేస్‌లో “రాష్ట్ర బడ్జెట్”
కాగా, సముద్ర జీవుల అన్వేషణలో ఇప్పటివరకు అంతర్జాతీయ పరిశోధకులే ప్రముఖ పాత్ర పోషించగా.. మొదటిసారి.. మాల్దీవియాన్ శాస్త్రవేత్త ఈ కొత్త జాతి చేపలను గుర్తించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చేపలు, సముద్ర జీవులపై పరిశోధనల నిమిత్తం అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మాల్దీవులకు వస్తుంటారు. అయితే స్థానిక శాస్త్రవేత్తల ప్రమేయం లేకుండానే వారు సొంతంగా పరిశోధనలు చేస్తుంటారు. ఈక్రమంలో మాల్దీవ్స్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జీవశాస్త్రవేత్తలు కొత్త చేప జాతిని గుర్తించి చరిత్ర లికించారు. ప్రస్తుతం గుర్తించిన సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా” చేప ఎంతో అందంగా ఉందని, ఇటువంటి చేపలను గతంలో ఎన్నడూ చూడలేదని.. ఈ పరిశోధనకు సారధ్యం వహించిన నజీబ్ పేర్కొన్నారు.
Also read: Covovax India : భారత్‌లో మరో కొవిడ్ టీకా.. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లలకు..!