ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్‌డౌన్ లేదు
లాక్‌డౌన్ అంటే ఏంటో ప్రపంచంలోని చాలా దేశాలకు తెలిసొచ్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్‌డౌన్ లేదు. జనాలంతా సాధారణంగానే తిరిగేస్తున్నారు.

లాక్‌డౌన్ అంటే ఏంటో ప్రపంచంలోని చాలా దేశాలకు తెలిసొచ్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్‌డౌన్ లేదు. జనాలంతా సాధారణంగానే తిరిగేస్తున్నారు.
లాక్‌డౌన్ అంటే ఏంటో ప్రపంచంలోని చాలా దేశాలకు తెలిసొచ్చింది. కరోనా వల్ల ఎక్కడికక్కడ వ్యవస్థలు స్తంభించాయి. కానీ.. ఇంతటి క్రైసిస్‌లోనూ లాక్‌డౌన్ అంటే ఏంటని ప్రశ్నించే ప్రజలు ఉన్నారంటే నమ్ముతారా? ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్‌డౌన్ లేదు. జనాలంతా సాధారణంగానే తిరిగేస్తున్నారు. అక్కడి ప్రభుత్వం సైతం ఇలా ఉండాలి.. అలా ఉండాలని ఒత్తిడి చేయట్లేదు. ఇంతకీ ఏంటా దేశం?
ఎక్కడో చైనాలోని వుహాన్‌లో పుట్టిన కరోనా వైరస్.. ఒకరి తర్వాత మరొకరికి సోకుతూ.. ప్రపంచదేశాలన్నింటినీ అల్లకల్లోలం చేస్తోంది. మరీ ముఖ్యంగా.. యూరప్ ఖండాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇటలీ, స్పెయిన్ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. కరోనా వైరస్‌ని లాక్‌డౌన్‌తో మాత్రమే అంతమొందించవచ్చని చాలా దేశాలు నమ్ముతున్నాయి. లాక్‌డౌన్‌ని కఠినంగా అమలుచేస్తూ.. దానిమీదే ఆశలు పెట్టుకున్నాయి. కానీ, స్వీడన్ మాత్రం దాని జోలికి వెళ్లడం లేదు.
యూరప్‌లోని చాలా దేశాలతో పోలిస్తే… స్వీడన్‌లో పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయి. లాక్ డౌన్ లేదు. జనాలు ఎప్పటిలాగే తిరిగేస్తున్నారు. నైట్‌క్లబ్బులు తెరిచే ఉన్నాయి. నలుగురు కలిసి పార్టీలు చేసుకుంటున్నారు. బయటకొచ్చి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఆఫీసులు పనిచేస్తూనే ఉన్నాయి. అయితే అన్ని దేశాల మాదిరే వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అక్కడి ప్రభుత్వం సూచించింది. అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. కస్టమర్లు కూర్చున్న చోటుకే పదార్థాలను అందించాలని అన్ని రెస్టారెంట్లు, బార్లు, కెఫేలను ఆదేశించింది. 50 మంది కంటే ఎక్కువ మంది గుమికూడటంపై నిషేధం విధించింది.
యూనివర్శిటీలు, కాలేజీలను మూసేసింది. అయితే, 16 ఏళ్ల లోపు విద్యార్థుల కోసం అన్ని స్కూళ్లు పని చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే.. సాధారణ జనజీవనం ఎప్పట్లాగే నడిచిపోతోంది. ఇవన్నీ చూసి… స్వీడన్‌లో కరోనా లేదనుకుంటే పొరపాటే. స్వీడన్ సైతం కరోనా బాధిత దేశమే. కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య 7 వేలకు చేరువలో ఉంది. 400 మందికి పైగా ఈ మహమ్మారితో చనిపోయారు. అయినా.. స్వీడన్.. కరోనా రాకముందు ఎలా ఉందో.. కరోనా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంది.
స్వీడన్ జనాభా కోటి మూడు లక్షల పైచిలుకు ఉంటుంది. జనవరి 30నే ఈ దేశంలో తొలి కరోనా రోగిని గుర్తించారు. నాటి నుంచీ ఈ వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంది. రోజూ పాజిటివ్ రోగుల సంఖ్య సైతం పెరుగుతూనే ఉంది. చనిపోతున్నవారు కూడా ఉన్నారు. అయినా ప్రజల్లో ఎలాంటి ఆందోళన లేదు. సుదీర్ఘ శీతాకాలం తర్వాత ఇప్పుడిప్పుడే అక్కడ ఎండాకాలం మొదలైంది. దీంతో స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్ సహా ప్రధాన నగరాల్లో జనం వెచ్చదనం కోసం కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి బయటకు వస్తున్నారు. పిల్లలు అయితే గుంపులు గుంపులుగా ఆడుకొంటున్నారు. దీనికి కారణం ప్రభుత్వం అవలంభవిస్తున్న విధానమే.
కరోనా మహమ్మారి విషయంలో అతిగా స్పందించడం హానికరమని ఆలోచించింది. ప్రజల్ని మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉంచాలంటే వారిని ఇళ్లల్లో ఎక్కువ కాలం ఉంచడం సరైందని కాదని భావించింది. అందుకే స్వీడన్ ప్రభుత్వం పొరుగు దేశాల అడుగు జాడల్లో నడవకుండా ఆంక్షల్ని సడలించింది. సామాజిక దూరం పాటించే బాధ్యతను ప్రజలకే అప్పగించింది. ఎవరికి వారు కనీసం దూరం పాటించాలని… అలాగే ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వారు ఇంటికే పరిమితం కావాలని ఆదేశించింది. దీంతో ఇప్పటిదాకా లాక్‌డౌన్ పెట్టాల్సిన అవసరం లేకుండాపోయింది.
కరోనా నుంచి తప్పించుకునేందుకు స్వీడన్ ప్రపంచ దేశాలకు అతీతంగా నిలిచింది. స్వీడన్ ప్రజల జీవన విధానమే ఆ దేశంలో కరోనా రక్కసి నుంచి కాపాడింది. ఇతర దేశాల్లో జనాలు గుంపులు గుంపులుగా గడపడానికి ఇష్టపడతారు. కానీ, స్వీడిష్ ప్రజలు గుంపులుగా బతకడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఎవరి సొంత ప్రపంచంలో వారు బతకడానికే ఇష్టపడతారు. ఇదే వారిని కరోనా వైరస్ నుంచి రక్షించేలా చేసింది.
ప్రజలంతా ఎవరికి వారు స్వచ్ఛందంగా సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. దీనికితోడు ప్రభుత్వం తీసుకుంటున్న కొద్దిపాటి చర్యలు కరోనా విస్తరణను అడ్డుకుంటున్నాయి. కరోనా ఉన్నప్పటికీ… ఎలాంటి భయం లేకుండా దేశవాసులు గడుపుతున్నారు. వ్యాపార సముదాయాలను బంద్ చేయకపోయినా.. ప్రజల కదలికలపై ఆంక్షలు విధించక పోయినా కరోనా అంటే స్వీడన్ ప్రజలు భయడపట్లేదు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారు.
మరోవైపు స్వీడన్ లాక్‌డౌన్‌కి దూరంగా.. ఇతర దేశాలకు భిన్నమైన మార్గంలో వెళ్లడాన్ని కొందరు నిపుణులు తప్పుపడుతున్నారు. అయితే ప్రభుత్వ శాస్త్రవేత్తల సలహా ప్రకారమే తాము ఈ విధమైన పాలసీని పాటిస్తున్నామని స్వీడన్ ప్రభుత్వం చెప్పుకొస్తోంది. మరి.. లాక్‌డౌన్‌తో పనే లేదన్న స్వీడన్ నిర్ణయం… ప్లస్ అవుతుందో, మైనస్ అవుతుందో చూడాలి.
Also Read | విందులు లేకున్నా సమస్య లేదు : ఇంట్లో ఉండటాన్ని పట్టించుకోని అంతర్ముఖులు