టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్‌కు కరోనా పాజిటివ్

కరోనా వైరస్ క్రీడారంగాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొంత మంది క్రికెటర్లు ఈ వైరస్ బారినపడగా.. ఇప్పుడు టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటిస్తున్నారు. తాజాగా వరల్డ్ నెం.1టెన్నిస్ దిగ్గజం,సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ కరోనా వైరస్ బారిన పడ్డాడు. అతడి భార్య జెలీనాకు సైతం పాజిటివ్‌గా తేలగా.. పిల్లలకు నెగిటివ్ వచ్చింది.
మంగళవారం ఓ ప్రకటనలో జకోవిచ్…బెల్గ్రేడ్లో అడుగుపెట్టగానే కరోనా టెస్టులు చేయించుకున్నా. నాకు, జెలీనాకు పాజిటివ్ వచ్చింది. మా పిల్లలకు నెగిటివ్‌గా తేలింది. గత నెల రోజులు నేను మంచి లక్ష్యంతో, స్వచ్ఛమైన మనసుతో పనులు చేశా. మా ప్రాంతంలో ఐక్యతను, సంఘీభావ సందేశాన్ని చాటేందుకు టోర్నీ నిర్వహించా’ అని జకోవిచ్ తెలిపాడు. 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటానని ప్రకటించాడు.
కాగా కరోనా వైరస్ ప్రభావం మధ్య సెర్బియా మరియు క్రొయేషియాలో టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహించడం మరియు ఇతర దేశాల నుండి ఆటగాళ్లను తీసుకురావడంపై జకోవిచ్ ఫై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో ఆటగాళ్లు భౌతిక దూరం కూడా పాటించలేదని కొందరు నెటిజన్లు మండిపడ్డారు
అయితే స్వచ్ఛమైన మనసుతో, మంచి లక్ష్యంతోనే టోర్నీని నిర్వహించానని జకోవిచ్ చెబుతున్నాడు. జకోవిచ్ నేతృత్వంలో సెర్బియా, క్రొయేషియాల్లో నిర్వహించిన ఆడ్రియా టూర్ టోర్నీలో పాల్గొన్న మరో ముగ్గురు ప్లేయర్లకు సైతం ఇది వరకే కరోనా సోకిన విషయం తెలిసిందే. . టోర్నీలో పాల్గొన్న గ్రిగోర్ దిమిత్రోవ్‌కు తొలుత కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆ తర్వాత బోర్నా కొరిచ్, విక్టర్ ట్రోయికి కరోనా వైరస్ సోకింది.