లగ్జరీ సౌకర్యాలు ఉండే, బాగా అభివృద్ధి చెందిన ఈ దేశంలో శాశ్వత నివాస హక్కు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి..
చాలా మంది భారతీయులు అక్కడ స్థిరపడాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. శాశ్వత నివాస హక్కు (పీఆర్) పొందితే కుటుంబాన్ని కూడా అక్కడకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది.

Finland
Finland: జీవనశైలి, భద్రత, సహజ సౌందర్యం కారణంగా ప్రపంచంలో మోస్ట్ హ్యాపియెస్ట్ కంట్రీగా ఫిన్లాండ్ నిలిచింది. చాలా మంది భారతీయులు అక్కడ స్థిరపడాలని, ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. ఫిన్లాండ్‌లో శాశ్వత నివాస హక్కు (పీఆర్) పొందితే కుటుంబాన్ని కూడా అక్కడకు తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది.
పీఆర్ పౌరసత్వం పొందే మార్గాన్ని ఫిన్లాండ్ సులభతరం చేస్తోంది. గత కొన్నేళ్లలో ఫిన్లాండ్ ప్రభుత్వం వలస చట్టాల్లో పలు ముఖ్యమైన మార్పులు చేసి, ఐటీ, ఇంజినీరింగ్, ఆరోగ్య రంగాల్లో నిపుణులను ఆకర్షిస్తోంది. (Finland)
ఫిన్లాండ్ ప్రభుత్వం చేసిన మార్పులు
ఫిన్లాండ్ ప్రభుత్వం 2025లో వలస నియమాల్లో ప్రధాన మార్పులు చేసింది. ఐటీ, ఆరోగ్య సేవలు, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేసే వారికి అక్కడ శాశ్వత నివాసం పొందడం సులభమైంది. ఫిన్లాండ్ పీఆర్ ద్వారా యూరోపియన్ కాని ఏ వ్యక్తి అయినా ఆ దేశంలో శాశ్వతంగా నివసించవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు.
పీఆర్ పొందిన వారికి ఆరోగ్య సేవలు, విద్య, ఇతర సామాజిక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ కార్డును ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించుకోవాలి. అయితే, ఫిన్లాండ్ పౌరసత్వం పొందాలంటే కనీసం ఎనిమిది సంవత్సరాలు ఆ దేశంలో నివసించి, అధికారిక భాష మాట్లాడగలగాలి.
ఇటీవల ఫిన్లాండ్ ప్రభుత్వం వర్క్ వీసా నిబంధనలను సవరించింది. కుటుంబాన్ని తీసుకురావాలనుకునే వ్యక్తి కనీసం రెండు సంవత్సరాలు ఫిన్లాండ్‌లో నివసించి ఉండాలి. ఇద్దరు జీవిత భాగస్వాముల కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలి.
- ఫిన్లాండ్‌లో శాశ్వత నివాసం పొందాలంటే నాలుగు సంవత్సరాలు నిరవధికంగా టైప్ ఏ (దీర్ఘకాల) నివాస అనుమతి ఉండాలి.
- టైప్ బీ (తాత్కాలిక) అనుమతి మీద ఫిన్లాండ్ గడిపిన కాలాన్ని పరిగణనలోకి తీసుకోరు.
- ఈ నాలుగు సంవత్సరాల్లో కనీసం రెండు సంవత్సరాలు ఫిన్లాండ్‌లో గడపాలి.
- ప్రస్తుతం ఉన్న అనుమతి చెల్లుబాటు అవ్వాలి.
- పోలీస్ రికార్డు స్వచ్ఛంగా ఉండాలి, ఆరోగ్య బీమా, నివాస చిరునామా ఉండాలి, బకాయిలు ఉండకూడదు.
దరఖాస్తు విధానం
- ఫిన్లాండ్ పీఆర్ లేదా నివాస అనుమతికి ‘ఎంటర్ ఫిన్లాండ్’ వెబ్‌సైట్ లేదా ‘వి.ఎఫ్.ఎస్. గ్లోబల్ ఇండియా’ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
- టైప్ ఏ అనుమతి ఉన్నవారు అవసరమైనప్పుడు దాన్ని పునరుద్ధరించాలి.
- అవసరమైన పత్రాలు: పాస్‌పోర్ట్, ఫొటో, ఆదాయ రుజువు, విద్యా సర్టిఫికెట్, నివాస రుజువు, కుటుంబ వివరాలు.
- ‘ఎంటర్ ఫిన్లాండ్’ పోర్టల్‌లో మీ ‘మిగ్రి ఐడీ’తో లాగిన్ అయి పీఆర్ దరఖాస్తు సమర్పించాలి.
- తర్వాత ‘మిగ్రి సర్వీస్ సెంటర్’లో బయోమెట్రిక్ నిర్ధారణ చేయాలి.
- దరఖాస్తు సమర్పించిన తర్వాత ఆన్‌లైన్‌లో స్టేటస్ తనిఖీ చేయవచ్చు.
- దరఖాస్తును పరిశీలించి పీఆర్ కార్డు జారీ చేస్తారు.
- తిరస్కరణకు గురైతే 30 రోజులలోపు అప్పీల్ దాఖలు చేయవచ్చు.