Gucchi Doon Chetin: పుతిన్‌కు రాష్ట్రపతి ఇచ్చిన విందులో ఖరీదైన ఫుడ్ ఐటెమ్ ఇదే.. ధర కేజీ 40వేలు..
ఈ మెనూలో భారత్ లోని వివిధ ప్రాంతాల వంటకాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ నుండి గుర్ సందేశ్, నార్త్ ఇండియా నుండి దాల్ తడ్కా, సౌత్ నుంచి..
Gucchi Doon Chetin: భారత్-రష్యా శిఖరాగ్ర సదస్సు కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు పుతిన్ ఇండియాలో పర్యటించారు. ఈ పర్యటనలో భారత్ లో ఆయన పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు.
రెండు రోజుల పర్యటన సందర్భంగా పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి ముర్ము శుక్రవారం రాత్రి రాష్ట్రపతిభవన్‌లో రష్యా అధ్యక్షుడికి విలాసవంతమైన శాఖాహార విందును ఇచ్చారు. ఈ విందులో పలు భారతీయ వంటకాలను ఆయనకు వడ్డించారు.
జోల్ మోమో, గుచ్చి డూన్ చెటిన్ నుండి తందూరి భర్వాన్ ఆలూ వరకు.. ఇంకా జఫ్రానీ పనీర్ రోల్, పాలక్ మేథీ మత్తర్ కా సాగ్, ఎల్లో దాల్ తడ్కా పులావ్, రొట్టెలు.. ఇలా వివిధ రకాల భారతీయ వంటకాలు మెనూలో ఉన్నాయి. ఇక డిజర్ట్స్ విషయానికి వస్తే.. బాదం కా హల్వా, కేసర్-పిస్తా కుల్ఫీ, గుర్ సందేశ్, తాజా పండ్లు, రిఫ్రెష్ ఫ్రూట్, అల్లం రసాలు మెనూలో ఉన్నాయి.
కశ్మీరీ స్టైల్‌లో వాల్‌నట్లను కలిపిన గుచ్చీ డూన్ చెటిన్, మినప వడలు, కూరగాయలతో నింపిన జోల్ మోమోలను పుతిన్‌కు వడ్డించారు. మెయిన్ కోర్స్‌లో జాఫ్రానీ పనీర్, పాలకూర మెంతికూర, పచ్చిబఠానీల కూరలతోపాటు పెరుగు, మసాలా దట్టించిన తందూరీ భార్వాన్ ఆలూ, చిన్న వంకాయలతో చేసిన ఆఛారీ బైగన్ లను పుతిన్ టేస్ట్ చేశారు.
ఈ భోజనం మొత్తం శాఖాహారమే. భారతదేశ విభిన్న పాక సంప్రదాయాలను మెనూలో చేర్చారు. ఈ మెనూలో భారత్ లోని వివిధ ప్రాంతాల వంటకాలు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ నుండి గుర్ సందేశ్, నార్త్ ఇండియా నుండి దాల్ తడ్కా, సౌత్ నుంచి మురుకు, హిమాలయ ప్రాంతాల నుండి జోల్ మోమో , జమ్మూ కాశ్మీర్ నుండి ప్రఖ్యాత గుచ్చి డూన్ చెటిన్ ఉన్నాయి.
విందులో రష్యా అధ్యక్షుడికి వడ్డించిన ఖరీదైన వంటకం ఇదే..!
పుతిన్ కు వడ్డించిన ఫుడ్ ఐటెమ్స్ లో ఒక ఆహారం చాలా ఖరీదైనది. అదే కాశ్మీరీ రుచికరమైన ఆహారం గుచ్చి డూన్ చెటిన్. గుచ్చి పుట్టగొడుగులు అరుదైనవి. ఈ కారణంగా ఇది ఖరీదుగా మారింది. ఈ పుట్టగొడుగుల ధర కేజీ రూ. 35వేల నుండి రూ. 40వేల వరకు ఉంటుంది. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.
గుచ్చి పుట్టగొడుగులు ఎందుకు అంత ప్రత్యేకమైనవి?
గుచ్చి పుట్టగొడుగులను సాగు చాలా కష్టం. నిర్దిష్ట నేల, ఉష్ణోగ్రతల మధ్య సహజ పరిస్థితుల్లో ఇవి వృద్ధి చెందుతాయి. ఇవి సాధారణంగా వసంతకాలంలో హిమాలయ బెల్ట్‌లో మంచు కరిగిన తర్వాత కనిపిస్తాయి. అటవీ మంటల బారిన పడిన ప్రాంతాల్లో కూడా పెరుగుతాయి.
గుచ్చి పుట్టగొడుగులు అరుదుగా లభిస్తాయి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో దొరుకుతాయి. వీటి సేకరణ చాలా కష్టంతో కూడుకున్నది. వారాల తరబడి కష్టతరమైన భూభాగాల మధ్య ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. పంటకోత సమయం తక్కువగా ఉండటం, కనుగొనడంలో ఇబ్బందులు.. గుచ్చి పుట్టగొడుగులు చాలా విలువైనవిగా, అత్యధిక ధర పలకడానికి కారణం అయ్యాయి.
గుచ్చి పుట్టగొడుగులకు ఎందుకంత ధర?
పరిమిత సరఫరా, చెఫ్‌లు స్థానికుల నుండి అధికమైన డిమాండ్ కారణంగా ఈ పుట్టగొడుగులు చాలా కాస్ట్ లీగా మారాయి. ఒక్కోసారి వీటి ధర కేజీ 50వేల వరకు వెళ్తాయి. అందుకే, గుచ్చి పుట్టగొడుగులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా మారాయి.
ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని గుచ్చి పులావ్, యాఖ్ని, రోగన్ జోష్ వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. వీటి ఆకృతి, అందులోని టేస్ట్.. మాంసానికి ప్రత్యామ్నాయంగా చేస్తుంది. దీని గొప్ప రుచి, సాంస్కృతిక ప్రాముఖ్యత.. గుచ్చికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టింది. రాష్ట్రపతి భవన్ లో పుతిన్ కు ఇచ్చిన విందులో అనేక ఫుడ్ ఐటెమ్స్ ఉన్నా.. గుచ్చి డూన్ చెటిన్ వంటకం హైలైట్ అయ్యింది. ఈ గుచ్చి డూన్ చెటిన్‌ను ప్రత్యేక శాఖాహార విందులో భాగంగా వడ్డిస్తారు.
Also Read: దేశంలో ఈ వస్తువుల ధరలు తగ్గిపోనున్నాయోచ్..! నిత్యావసరాల ధరలు కూడా..
