మోడీ పర్యటన తర్వాత అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..రైళ్లు, హిందూ ఆలయాలు ధ్వంసం

భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనను వ్యతిరేకిస్తూ..బంగ్లాదేశ్ లోని ఇస్లామ్​ గ్రూప్​ లకు చెందిన వ్యక్తులు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టించారు.

మోడీ పర్యటన తర్వాత అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..రైళ్లు,  హిందూ ఆలయాలు ధ్వంసం

Bangladesh Clashes

Updated On : March 28, 2021 / 9:26 PM IST

Bangladesh Clashes భారత ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ పర్యటనను వ్యతిరేకిస్తూ..బంగ్లాదేశ్ లోని ఇస్లామ్​ గ్రూప్​ లకు చెందిన వ్యక్తులు దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఆదివారం పలు జిల్లాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి బీభత్సం సృష్టించారు. తూర్పు బంగ్లాదేశ్‌లోని హిందూ దేవాలయాలు, ఓ రైలుపై కరుడుగట్టిన ఇస్లామ్​ గ్రూప్​ లకు చెందిన వ్యక్తులు దాడులకు తెగబడ్డారు. భారత్ లోని ముస్లింలకు వ్యతిరేకమైన విధాలను నరేంద్రమోడీ అమలుచేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.

కాగా,శుక్రవారం(మార్చి-26,2021)భారత ప్రధాని నరేంద్రమోడీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఢాకాలోని నేషనల్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బంగ్లాదేశ్ 50 వ వార్షికోత్సవ కార్యక్రమాల ముగింపు సభలో ఆ దేశ ప్రధాని షేక్ హసీనాతో కలిసి మోడీ పాల్గొన్నా. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు 12 లక్షల కోవిడ్ -19 వ్యాక్సిన్ షాట్లను బహుమతిగా ఇచ్చిన తరువాత శనివారం తిరిగి భారత్ కు వచ్చారు మోడీ. అయితే, మోడీ,ఢాకాలో ఉన్న సమయంలో కొన్ని ఇస్లామిక్ గ్రూప్ లు ఆందోళనకు దిగాయి. మోడీ పర్యటనకు వ్యతిరేకంగా ఇస్లామిక్ గ్రూపులు నిర్వహించిన ప్రదర్శనల సందర్భంగా పోలీసులతో జరిగిన ఘర్షణల్లో శుక్రవారం నుంచి కనీసం 11 మంది నిరసనకారులు మరణించారని,జనసాంద్రత కలిగిన రాజధాని ఢాకాలో డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు.

అయితే, పోలీసులు శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న తమ మద్దతుదారులను హత్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ హిఫాజత్-ఈ-ఇస్లామ్ గ్రూప్ ఆదివారం దేశవ్యాప్తంగా సమ్మెను అమలు చేసింది. ఢాకా, నార్సింగ్​డీ, నారాయణ్​గంజ్, చిట్టాగాంగ్​, సిల్హెట్​, రాజ్​షాహీ సహా.. పలు జిల్లాల్లో హిఫాజత్​-ఇ-ఇస్లామ్​ సమ్మె కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా.. నారాయణ్​గంజ్​ మదానీనగర్​ మద్రాస విద్యార్థులు.. ఢాకా-చిట్టాగాంగ్​ రోడ్డుపై టైర్లను తగులబెట్టారు. ఫలితంగా.. చిట్టాగాంగ్​, సిల్హెట్​ నుంచి రాజధానికి వెళ్లే మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది.

హిఫాజత్-ఈ-ఇస్లామ్ గ్రూప్ మద్దతుదారులు.. భారతీయ దిగ్గజ సంగీత వాయిద్యకారుడు అల్లావుద్దీన్​ ఖాన్​ జన్మస్థలం అయిన బ్రహ్మన్​బరియాలోని సెంట్రల్​ లైబ్రరీకి నిప్పంటించారు. అంతేకాకుండా ఓ రైలుపై కూడా దాడికి పాల్పడ్డారు. రైలు ఇంజిన్ ని ధ్వంసం చేయడంతో పాటు అన్ని బోగీలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10మంది పౌరులు గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ల్యాండ్ ఆఫీస్ సహా ప్రభుత్వ కార్యాలయాలు మరియు ప్రభుత్వ ప్రాయోజిత మ్యూజిక్ అకాడమీకి ఆందోళనకారులు నిప్పంటించారని మరియు అనేక హిందూ దేవాలయాలు కూడా దాడి చేశాయని బ్రహ్మన్‌బరియా పట్టణంలోని జర్నలిస్ట్ జావేద్ రహీమ్ తెలిపారు. ప్రెస్ క్లబ్ పై కూడా దాడి జరిగిందని, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడితో సహా చాలా మంది జర్నలిస్టులు కూడా గాయపడ్డారని జావేద్ రహీమ్ తెలిపారు.

రాజ్‌షాహి జిల్లాలో రెండు బస్సులను కూడా ఆందోళనకారులు తగులబెట్టారు. పలు ప్రాంతాల్లో వందలాది మంది నిరసనకారులు.. పోలీసులపై దాడికి దిగారు గొడవపడి. తమపై నిరసనకారులు రాళ్లతో దాడికి పాల్పడ్డారని మూడు జిల్లాల్లోని పోలీసు వర్గాలు తెలిపాయి. రాజధాని ఢాకాకు వెలుపల ఉన్న నారాయణగంజ్‌ లో రోడ్లను దిబ్భందించడానికి నిరసనకారులు విద్యుత్ స్తంభాలు, టింబర్ మరియు ఇసుక సంచులను ఉపయోగించారు. అయితే పోలీసులు రబ్బరు బుల్లెట్లు మరియు టియర్ గ్యాస్‌తో వారిని ఎదుర్కొన్నారు. అనేక రోడ్లను దిబ్భందించడంతో పాటు నిరసనకారులు ఢాకాలో అనేక బస్సులను ధ్వంసం చేసి తగులబెట్టారని ఓ పోలీసు అధికారి తెలిపారు.