Alcatraz Prison: అతి భయంకరమైన, కరడుగట్టిన నేరస్తులను ఉంచే ఆ జైలును మళ్లీ తెరవాలంటున్న ట్రంప్..! ఎందుకు.. అది ఎక్కడుంది..

ఆ కారాగారాన్ని తిరిగి ప్రారంభించడానికి వీలుగా అల్కాట్రాజ్‌ను విస్తరించాలి, పునర్ నిర్మించాలని ట్రంప్ చెప్పారు.

Alcatraz Prison: అతి భయంకరమైన, కరడుగట్టిన నేరస్తులను ఉంచే ఆ జైలును మళ్లీ తెరవాలంటున్న ట్రంప్..! ఎందుకు.. అది ఎక్కడుంది..

Updated On : May 5, 2025 / 6:00 PM IST

Alcatraz Prison: అదొక జైలు. అందులో భయంకరమైన, కరుడుగట్టిన క్రిమినల్స్ ను ఉంచుతారు. అదే అల్కాట్రాజ్ ప్రిజన్. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్‌కు సమీపంలో ఉన్న ద్వీపమే అల్కాట్రాజ్. ఇక్కడే ఓ కారాగారం ఏర్పాటు చేశారు. ఇప్పుడా జైలుపై ట్రంప్ కన్ను పడింది. ఆ ప్రిజన్ ను మళ్లీ తెరవాలని ఆయన అంటున్నారు.

అల్కాట్రాజ్ కారాగారంలో 1963 వరకు అత్యంత భయంకరమైన, కరడుగట్టిన నేరస్తులను బందీలుగా ఉంచే వారు. ఈ కారాగారాన్ని మళ్లీ ప్రారంభించాలని, విస్తరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించారు.

ట్రంప్ అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. తరచుగా నేరాలకు పాల్పడుతున్న వారితో.. హింసాత్మక, ప్రమాదకర నేరస్తులతో అమెరికా సుదీర్ఘకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ట్రంప్ అన్నారు. ఈ క్రమంలో అల్కాట్రాజ్ జైలును తిరిగి ప్రారంభించి, దాన్ని శాంతిభద్రతలకు, న్యాయానికి ప్రతీకగా ఉపయోగించాలన్నారు ట్రంప్.

ఆ కారాగారాన్ని తిరిగి ప్రారంభించడానికి వీలుగా అల్కాట్రాజ్‌ను విస్తరించాలి, పునర్ నిర్మించాలని ట్రంప్ చెప్పారు. బ్యూరో ఆఫ్ ప్రిజన్స్‌తో పాటు డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, ఎఫ్‌బీఐ, హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగాలను ఈ మేరకు ఆయన ఆదేశించారు. అమెరికాలోని అత్యంత ప్రమాదకరమైన, హింసాత్మకమైన క్రిమినల్స్ కు ఈ జైలు ఆవాసం అవుతుందని ట్రంప్ తెలిపారు.

అపఖ్యాతి పాలైన అల్కాట్రాజ్ జైలు గురించి విస్తుగొలిపే విషయాలు..

* అల్కాట్రాజ్ అనే పేరు స్పానిష్ పదం “అల్కాట్రేసెస్” నుండి వచ్చింది. దీని అర్థం పెలికాన్లు లేదా వింత పక్షులు. దీనికి 1775లో అన్వేషకుడు జువాన్ మాన్యుయెల్ డి అయాలా పేరు పెట్టారు. 1850లో, ఈ ద్వీపం సైనిక ఉపయోగం కోసం కేటాయించబడింది. శాన్ ఫ్రాన్సిస్కో బే కోసం “రక్షణ త్రిభుజం”లో భాగమైంది. ఇది వెస్ట్ కోస్ట్ మొట్టమొదటి లైట్‌హౌస్‌ను కూడా కలిగి ఉంది.
* అల్కాట్రాజ్ తొలుత నౌకాదళ రక్షణ కోట. 20వ శతాబ్దం తొలినాళ్లలో దీన్ని పునర్ నిర్మించారు. సైనిక కారాగారంగా మార్చారు.

Alcatraz The Prison Island
* 1909 నుంచి 1911 మధ్య ఖైదీలు స్వయంగా కొత్త జైలు భవనాన్ని నిర్మించడంలో సహాయపడ్డారు.
* 1930లో అమెరికా న్యాయశాఖ దీన్ని స్వాధీనం చేసుకుంది. ఫెడరల్ ప్రిజన్ సిస్టమ్ పరిధిలోని ఖైదీలను ఇక్కడకు పంపించడం ప్రారంభించింది.
* 1934లో అల్కాట్రాజ్ ఒక సమాఖ్య జైలుగా మారింది. ఇది “అత్యంత కరుడుగట్టిన” ఖైదీల కోసం ఉద్దేశించబడింది. ఇతర సమాఖ్య సౌకర్యాలలో ఇబ్బంది కలిగించే వారు.

* మాబ్ బాస్ అల్ కాపోనె, మైకే కోహెన్, కిడ్నాపర్ జార్జ్ ‘మెషిన్ గన్’ కెల్లీ వంటి ప్రమాదకరమైన గ్యాంగ్‌స్టర్లు సహా సంచలనం సృష్టించిన పలువురు క్రిమినల్స్ ను ఉంచడానికి ఈ జైలు ఉపయోగపడింది.

Also Read: సినిమాలకు ట్రంప్ దెబ్బ.. ట్రంప్ చెప్పింది హాలీవుడ్ సినిమాలకా? అన్ని దేశాల సినిమాలకా? టాలీవుడ్ కి ఎఫెక్ట్..?

* ఇక్కడ పరిస్థితులు కఠినంగా ఉండేవి. చాలా సెల్స్ కేవలం 9 అడుగులు x 5 అడుగులు మాత్రమే ఉండేవి. కనీస ఫర్నిషింగ్ మాత్రమే ఉండేవి. అయితే, ఖైదీలకు వేడి నీరు అందేది. అమెరికా జైలు వ్యవస్థలో అత్యుత్తమమైన భోజనం అందించబడింది.
* హత్య కేసులో జీవితఖైదు పడిన రాబర్ట్ స్ట్రాడ్ పాత్రలో బర్ట్ లాంకాస్టర్ నటించిన 1962 నాటి ‘బర్డ్‌ మ్యాన్ ఆఫ్ అల్కాట్రాజ్’ చిత్రంతో ఈ ద్వీపకారాగారం మరింత ప్రచారంలోకి వచ్చింది.
ఇక్కడ జైలు జీవితం గడుపుతూనే పక్షులపై ఆసక్తితో అధ్యయనం ప్రారంభించిన రాబర్ట్ తర్వాత ఒక నిపుణుడైన పక్షి శాస్త్రవేత్తగా ఎదగడం ఈ చిత్రం కథాంశం.

* అల్కాట్రాజ్ ద్వీపంలో బందీలైన ఎస్ఏఎస్ (స్పెషల్ ఎయిర్ సర్వీసు) మాజీ కెప్టెన్, ఎఫ్‌బీఐ కెమిస్ట్‌లకు విముక్తి కల్పించడమనే కథాంశంతో 1996లో సీన్ కానరీ, నికోలస్ కేజ్ తారాగణంతో విడుదలైన ‘ది రాక్’ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది.
* ఈ జైలు నుంచి అత్యంత ప్రసిద్ధ తప్పించుకునే ప్రయత్నం 1962లో జరిగింది. ఫ్రాంక్ మోరిస్ సోదరులు జాన్ క్లారెన్స్ ఆంగ్లిన్ వారి గదుల నుండి అదృశ్యమయ్యారు. వారు రెయిన్ కోట్లతో తయారు చేసిన తెప్పను ఉపయోగించారు. మునిగిపోయారని భావించినప్పటికీ, మృతదేహాలు ఎప్పుడూ గుర్తించలేదు.
* అల్కాట్రాజ్ ఒక స్వయం సమృద్ధిగల సమాజం. గార్డులు వారి కుటుంబాలతో సహా దాదాపు 300 మంది ఈ ద్వీపంలో నివసించారు. అక్కడ నివసించే పిల్లలు ప్రతిరోజూ ప్రధాన భూభాగంలోని పాఠశాలకు పడవలో వెళ్లేవారు.

Prison Island

* 1963లో ఈ జైలు మూతపడింది. అందుకు కారణం ఖైదీలు తప్పించుకోవడం కాదు. దాని నిర్వహణ ఖర్చులు భారీగా ఉండటమే. ఇతర సమాఖ్య జైళ్ల కంటే ఈ ద్వీప కారాగార నిర్వహణ భారం మూడింతలు అధికంగా ఉండటమే మూసివేతకు కారణం.
* మూసివేత తర్వాత 1969లో ఈ ద్వీపం స్థానిక అమెరికన్ కార్యకర్తల ఆక్రమణకు గురైంది. ఇది 19 నెలల పాటు కొనసాగి సమాఖ్య తొలగింపుతో ముగిసింది.
* శాన్ ఫ్రాన్సిస్కో గోల్డెన్ గేట్ బ్రిడ్జికి దగ్గరలో ఉన్న అల్కాట్రాజ్ ప్రస్తుతం ఒక ప్రధాన పర్యటక ప్రాంతంగా ఉంది. ప్రతి సంవత్సరం దాదాపు 1.4 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇది గోల్డెన్ గేట్ నేషనల్ రిక్రియేషన్ ఏరియాలో భాగం. చరిత్రాత్మక భవనాలు, తోటలు, ఒక లైట్‌హౌస్‌ను కలిగి ఉంది.