ఆగని ట్రంప్…కరోనా వైరస్ కాదు చైనీస్ వైరస్

  • Published By: venkaiahnaidu ,Published On : March 20, 2020 / 01:54 PM IST
ఆగని ట్రంప్…కరోనా వైరస్ కాదు చైనీస్ వైరస్

Updated On : March 20, 2020 / 1:54 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరించడానికి చైనానే కారణమని మరోసారి ట్రంప్ విమర్శించారు. కరోనా వైరస్ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడం వల్లనే ప్రపంచం ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటుందని ట్రంప్ అన్నారు. కరోనా వైరస్‌పై కొద్దినెలలు ముందుగా మనకు సమాచారం ఉంటే బాగుండేదని, చైనాలో ఈ వైరస్‌ పుట్టుకొచ్చిన ప్రాంతానికే దాన్ని కట్టడి చేసి ఉండాల్సిందని వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో​ ట్రంప్‌ పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి ప్రజారోగ్యాన్ని హరించేందుకు చైనాయే కారణమని ట్రంప్‌ నేరుగా బీజింగ్‌ను తప్పుపట్టారు. ఈ వైరస్‌ గురించి ముందుగా తెలిసిన వారు దాన్ని అక్కడే నిలుపుదల చేసి ఉండాల్సిందని, వారు చేసిన పనికి ఇప్పుడు ప్రపంచమంతా వైరస్‌ బారిన పడి విలవిలలాడుతోందని, ఇది సరైంది కానేకాదని చైనా తీరును ట్రంప్‌ తప్పుపట్టారు. 

కరోనా వైరస్ కాదది చైనీస్ వైరస్ అంటూ మరోసారి చైనాపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాపై ప్రతీకారం తీర్చుకుంటారా అన్న ప్రశ్నపై ట్రంప్‌ స్పందించలేదు. ఇప్పటివరకు అమెరికాలో 14వేల 371మందికి కరోనా సోకగా,217మంది ప్రాణాలు కోల్పోయారు. 125మంది కరోనా పేషెంట్లు కోలుకున్నారు. కాగా, గత ఏడాది డిసెంబర్‌ 31న సోషల్‌ మీడియాలో వైరస్‌ గురించి తొలిసారిగా రాసి, ఆ తర్వాత కోవిడ్‌-19తో మరణించిన డాక్టర్‌ లీ వెలింగ్‌ను స్ధానిక పోలీసులు వైరస్‌పై నోరుమెదపవద్దని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య10వేలు దాటింది. అయితే ఈ వైర‌స్ సోకిన వారి సంఖ్య ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల 50 వేల‌కు చేరుకుంటోంది. అయితే కరోనా మరణాలు వైరస్ మొదట పుట్టిన చైనా కంటే ఇటలీలోనే ఎక్కువగా నమోదయ్యాయి.