పర్యటనకు ముందే….భారత్ కు ట్రంప్ బ్యాడ్ న్యూస్

అగ్రరాజ్యం అధ్యక్షుడి భారత పర్యటనకు సమయం ఆసన్నమయింది. రెండు రోజుల పాటు భారత్ లో పర్యటించేందుకు ఫిబ్రవరి-24,2020న ట్రంప్ ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. భారత్-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయన రెండు రోజుల పర్యటనపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదురే అవకాశముందని అందరూ భావించారు. అయితే అందరూ ఊహించినట్లు చేస్తే ఆమన ట్రంప్ ఎందుకవుతారు. తన స్టయిల్ లో భారత్-అమెరికా ట్రేడ్ డీల్ పై స్పందించారు ట్రంప్.
భారత్ తో ఇప్పట్లో ట్రేడ్ డీల్ (వాణిజ్య ఒప్పందం)ఉండదని పర్యటనకు ముందే భారత్ కు బిగ్ షాక్ ఇచ్చారు ట్రంప్. మంగళవారం(ఫిబ్రవరి-18,2020) తన భారత పర్యటన గురించి మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ…. భారత్ తో ట్రేడ్ డీల్స్ కు కట్టుబడి ఉన్నామని,అయితే అది అధ్యక్ష ఎన్నికల తరువాత ఆలోచిస్తామని తెలిపారు. భవిష్యత్తులో భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం తప్పక ఉంటుందని ట్రంప్….భారత్ తో ట్రేడ్ డీల్ అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నవంబర్ కి ముందు జరుగుతుందో లేదో అన్నది తనకు తెలియదన్నారు
అయితే అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్‌హైజర్.. భారత్‌తో వాణిజ్య చర్చలు జరిపారు. ట్రంప్ పర్యటన బృందంలో లైట్‌హైజర్ లేరని తెలుస్తోంది. లైట్‌హైజర్ లేకపోవచ్చన్న వార్తలు.. ఒప్పందం ఇప్పట్లో కుదిరే అవకాశం లేదన్న ట్రంప్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది. ఇప్పట్లో కుదిరే అవకాశం లేదన్న ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే… ఈ డీల్ జరగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పూర్తి స్థాయి ఒప్పందం కుదరకపోయినప్పటికీ…పాక్షిక ఒప్పందం వైపు మొగ్గుచూపే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇరుదేశాలు పెంచిన టారిఫ్‌లే ఒప్పందం ఖరారులో చిక్కుముడిగా మారినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ అంటే తనకెంతో ఇష్టమని ట్రంప్ తెలిపారు. ఎయిర్‌పోర్టు, స్టేడియానికి మధ్య 70 లక్షల మంది స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారని మోడీ తనతో చెప్పడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని ట్రంప్ తెలిపారు
తన భారత పర్యటనలో ట్రంప్ గుజరాత్ లో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ లో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ఈ సందర్భంగా ట్రంప్ భారత ప్రధాని నరేంద్రమోడీతో కలిసి ప్రారంభిస్తారు. సబర్మతిలోని గాంధీ ఆశ్రమాన్ని కూడా ట్రంప్ సందర్శించే అవకాశం ఉంది. డోనాల్డ్ ట్రంప్ కోసం గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకోనున్న ఆయన అక్కడ మూడు గంటలు గడపనున్నారు. దీంతో ట్రంప్ 3గంటల పర్యటన కోసం గుజరాత్ సర్కార్ రూ. 100కోట్లు వెచ్చిస్తోంది. మోడీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు మరో రూ. 4 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రోడ్ షోకు సుమారు 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్రంప్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్ లో పాన్ షాపులను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై ఎవ్వరూ పాన్ నమిలి ఊయకుండా,గోడలు,రోడ్లు శుభ్రంగా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్-మోడీ రోడ్ షో మార్గంలో ట్రంప్ కు మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గడను కూడా నిర్మించారు. మరోవైపు పలు విమానసర్వీసలును రీషెడ్యూల్ చేయడం,విమానాలను దారి మళ్లించడం చేస్తున్నారు. దాదాపు 60అంతర్జాతీయ,దేశీయ విమానాలను రీషెడ్యూల్ చేశారు. వీధి కుక్కలను ఎక్కడికక్కడ పట్టుకుని బంధించారు అధికారులు. సమ్ల్ లలో నివసించే 45కుటుంబాలు వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అహ్మదాబాద్ మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Read More>>తారక్ 30 – క్రేజీ అప్‌డేట్!