ఆ దేశంపై యుద్ధానికి అమెరికా రెడీ? ట్రంప్‌ కీలక కామెంట్స్‌.. యూఎస్‌కు రష్యా వార్నింగ్‌

భూతల దాడులు చేస్తారా? అన్న విషయంపై ప్రశ్నించగా.. ట్రంప్‌ దానికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. “అది చేయబోతున్నానా? లేదా? అన్నది చెప్పను. వెనెజువెలా విషయంలో నేను ఏం చేయబోతున్నానో చెప్పను” అని అన్నారు.

ఆ దేశంపై యుద్ధానికి అమెరికా రెడీ? ట్రంప్‌ కీలక కామెంట్స్‌.. యూఎస్‌కు రష్యా వార్నింగ్‌

Updated On : November 3, 2025 / 7:09 PM IST

Donald Trump: వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయడానికి సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ… తాము యుద్ధం చేసే అవకాశాలు తక్కువేనని అంటూనే.. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురో ఆ పదవిలో ఎంతో కాలం ఉండబోరని అన్నారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ట్రంప్‌ను.. “వెనెజువెలాపై అమెరికా యుద్ధం చేయబోతుందా?” అని అడిగారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ.. “యుద్ధం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ, వారు (వెనెజువెలా అధికార నేతలు) మనతో సరైన రీతిలో ప్రవర్తించడం లేదు” అని సమాధానమిచ్చారు. (Donald Trump)

సెప్టెంబర్‌ ప్రారంభం నుంచి ఇప్పటివరకు కరేబియన్‌, తూర్పు పసిఫిక్‌ ప్రాంతాలలో అమెరికా దాడుల వల్ల 64 మంది మరణించారు. ఇక భూతల దాడులు చేస్తారా? అన్న విషయంపై ప్రశ్నించగా ట్రంప్‌ దానికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. “అది చేయబోతున్నానా? లేదా? అన్నది చెప్పను. వెనెజువెలా విషయంలో నేను ఏం చేయబోతున్నానో చెప్పను” అని అన్నారు.

గత రెండు నెలలుగా అమెరికా సైన్యం కరేబియన్‌ సముద్రంలో యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, బాంబర్లు, మెరైన్‌ దళాలు, డ్రోన్లు, గూఢచారి విమానాలను పంపుతోంది.

కరేబియన్‌ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ.. అక్కడి పడవలపై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు అమెరికాలోకి డ్రగ్స్‌ రవాణా కాకుండా ఆపేందుకు అవసరమని ట్రంప్‌ ప్రభుత్వం చెబుతోంది.

Also Read: ఈపీఎస్-95 పెన్షన్ పెరుగుతుందా? మీకు ఎంత డబ్బు వస్తుందో, లెక్క ఎలా వేస్తారో తెలుసుకోండి..

మాదకద్రవ్యాల నియంత్రణ కంటే వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను ఆ పదవి నుంచి తొలగించడంపై ఎక్కువ దృష్టి పెట్టి అమెరికా చర్యలు తీసుకుంటోందని వచ్చిన ఆరోపణలను ట్రంప్‌ ఖండించారు. అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అమెరికా తీరు సరికాదు: రష్యా
కరేబియన్‌ ప్రాంతంలో మాదకద్రవ్యాల వ్యతిరేక యుద్ధం పేరుతో అమెరికా భారీగా సైనిక శక్తిని వాడుతోందని, దీన్ని ఖండిస్తున్నామని రష్యా చెప్పింది. వెనెజువెలా అధ్యక్షుడు వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్‌ మదురోకు మద్దతు తెలిపింది.

ఆదివారం క్రెమ్లిన్‌ ఓ ప్రకటన చేస్తూ.. అమెరికా, వెవెజువెలా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ. “అమెరికా భారీగా సైనిక శక్తిని వాడుతుండడాన్ని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది” అని పేర్కొన్నారు. వెవెజువెలా ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఫాలో కావాలంటూ రష్యా వార్నింగ్ ఇచ్చింది.