ట్రంప్ గుస్సా : భారత్ – అమెరికా మధ్య హైడ్రాక్సీ క్లోరోక్విన్ చిచ్చు

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 05:05 AM IST
ట్రంప్ గుస్సా : భారత్ – అమెరికా మధ్య హైడ్రాక్సీ క్లోరోక్విన్ చిచ్చు

Updated On : April 7, 2020 / 5:05 AM IST

హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు భారత్ – అమెరికాల మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి. భారత్ తీరుపై ట్రంప్ కాస్త ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనాపై పోరాటానికి ఆ మాత్రలను తమకు భారీగా పంపించాలని అమెరికా కోరుతోంది. దీనిపై ట్రంప్ మోదీతో ఫోన్‌లో కూడా మాట్లాడారు. ఇటు భారత్ మాత్రం దేశంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో పెద్దమొత్తంలో అమెరికాకు ఎలా అందిస్తామని అంటోంది. దీనిపై త్వరలోనే భారత్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే ట్రంప్ మాత్రం భారత్ తీరుపై తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.

కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని ట్రంప్‌ అన్నారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన హైడ్రాక్సీ క్లోరోక్విన్ విషయంపై స్పందించారు. అమెరికాతో భారత్‌ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని అన్నారు. అదే సమయంలో ఒకవేళ మందుల్ని సరఫరా చేయొద్దన్నదే మోదీ నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎగుమతిపై భారత్ నిషేధాన్ని ఎత్తివేయకపోతే దానికి ప్రతీకారం ఉంటుందని అన్నారు ట్రంప్. 

కరోనా పరిస్థితులపై ఇరుదేశాధినేతలు ఆదివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ సమయంలోనే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని తమకు సరఫరా చేయాలని ట్రంప్‌ భారత్‌ను కోరారు. మలేరియాకు మందుగా ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల్ని వాడుతున్నారు. వీటి  ధర కూడా పెద్ద ఎక్కువేం కాదు. అయితే ఈ మందు కరోనాను తరిమికొట్టడంలో ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు.  

దీంతో హైడ్రాక్సిక్లోరోక్విన్‌పైనే ట్రంప్‌ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ ఔషధం సహా కరోనా చికిత్సలో ఉపయోగపడే ఇతర మందుల ఎగుమతిపై భారత్‌ నిషేధం విధించింది. కరోనా రోగులు, అనుమానితులకు చికిత్స చేస్తున్న సిబ్బందికి, రోగుల దగ్గరగా వచ్చిన బంధువులకు ఈ మందును ఇవ్వాలని భారత వైద్య పరిశోధన మండలి కూడా సూచించింది.   
హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని మరికొన్ని దేశాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి.(కరోనా ట్రీట్మెంట్ కోసం ఐసీయులో చేరిన బ్రిటన్ ప్రధాని)

మరోవైపు భారత్‌లోనూ కరోనా మహమ్మారి రోజురోజుకీ తన ఉనికిని విస్తరిస్తూ పోతోంది. అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాల్లో వైరస్‌ను కట్టడి చేయాలంటే వ్యూహాత్మక ఔషధ నిల్వలు భారీ స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మోదీ ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.