Trumps Gold Card : ట్రంప్ గోల్డ్, ప్లాటినమ్ కార్డులు ఏమిటి..? వీటి వల్ల ఉపయోగం ఎవరికి..? ఎంత చెల్లించాలి.. అమెరికాలో ఎన్నిరోజులు ఉండొచ్చు..
అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డు (Trumps Gold Card) ను కొనుగోలు చేయడం ద్వారా పౌరసత్వం పొందవచ్చునని చెప్పారు.

Trump Gold Card
Trumps Gold Card : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అదే సమయంలో ట్రంప్ గోల్డ్ కార్డునుసైతం ప్రకటించారు. అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డును కొనుగోలు చేయడం ద్వారా పౌరసత్వం పొందవచ్చునని చెప్పారు.
గోల్డ్ కార్డు ధరను వ్యక్తులకు ప్రాసెసింగ్ ఫీజు కాకుండా 10లక్షల డాలర్లుగా నిర్ణయించారు. అదే కంపెనీలకు అయితే 20లక్షల డాలర్లు ఉంటుందని ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో ప్లాటినం కార్డును కూడా ప్రవేశపెట్టారు. దీనివిలువ 50లక్షల డాలర్లు అని తెలిపారు. విదేశీలు ఈ మొత్తం చెల్లించి 270రోజుల పాటు ఎలాంటి పన్నులు లేకుండా అమెరికాలో ఉండొచ్చునని అన్నారు. అయితే, అమెరికాలో సంపాదించిన మొత్తానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
పెట్టబడి దారులకు ఐదు మిలియన్ డాలర్ల ధరతో గోల్డ్ కార్డును ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ప్రకటించారు. దానినే ఇప్పుడు ప్లాటినం కార్డుగా మార్చారు. అయితే, ప్లాటినం కార్డుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. గోల్డ్ కార్డు ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. పన్నుల తగ్గింపు అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు తెలిపారు.
ట్రంప్ గోల్డ్ కార్డు పొందాలంటే ..
ట్రంప్ గోల్డ్ కార్డు పొందాలంటే 10లక్షల డాలర్లు (దాదాపు 8.8కోట్ల రూపాయలు) చెల్లించాలి. ఈ కార్డు పొందాలనుకునే వారు నాన్ – రిఫండబుల్ ప్రాసెసింగ్ ఫీజుతో పాటు అప్లికేషన్లు సమర్పించాలి. ఈ గోల్డ్ కార్డు పొందితే అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో ఎక్కడికైనా వెళ్లి ఉపయోగించుకోవచ్చు.
ట్రంప్ ప్లాటినమ్ కార్డ్ అంటే..?
ట్రంప్ ప్లాటినమ్ కార్డు పొందాలంటే 50లక్షల డాలర్లు (దాదాపు 44కోట్ల రూపాయలు) చెల్లించాలి. ఈ కార్డుకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే, ఒక వ్యక్తి ఈ ప్లాటినమ్ కార్డు కోసం సైన్ అప్ చేసి వెయిటింగ్ లిస్టులో తన స్థానాన్ని పొందవలసి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పరిశీలన కోసం వేచి ఉండాలి. ఈ కార్డు వస్తే అమెరికాలో 270 రోజుల వరకు ఇతర దేశాల్లో సంపాదించే ఆదాయంపై పన్ను కట్టకుండా గడపవచ్చు.