గెలిస్తే హిస్టరీ : అమెరికా అధ్యక్ష బరిలో హిందూ మహిళ

2020లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మహిళ తులసి గబ్బార్డ్ ప్రకటించారు. వారం రోజుల్లో దీనిపై అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం తులసి హవాయి నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1981 ఏప్రిల్ 12న అమెరికాలోని లిలోలాలో తులసి జన్మించారు. తండ్రి మైక్ గబ్బార్డ్ కేథలిక్ కాగా తల్లి కరోల్ పోర్టర్ గబ్బార్డ్ హిందువు.
37 ఏళ్ల వయస్సున్న తులసి చిన్నతనంలోనే హిందూ మతం స్వీకరించారు. 2012లో హవాయి నుంచి మొదటిసారి చట్టసభ్యురాలిగా ఎన్నికయ్యారు. భగవద్గీతపై ప్రమాణం చేసి సెనెటర్‌గా బాధ్యతలు స్వీకరించారు. డెమోక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీకి దిగుతున్న రెండో మహిళగా తులసి నిలువనున్నారు. అంతేకాకుండా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందువు కూడా తులసి కావడం విశేషం. ఒకవేళ ట్రంప్‌పై విజయం సాధిస్తే అధ్యక్ష పదవిని చేపట్టే తొలి మహిళగానే కాకుండా చిన్న వయస్సులో అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన వ్యక్తిగా, తొలి క్రిస్టియనేతర అధ్యక్ష పదవిని చేపట్టిన వ్యక్తిగా తులసి రికార్డు సృష్టించనున్నారు.
మనం అధిగమించలేని సవాల్ అంటూ ఏదీ లేదు. మీరు నాతో చేరుతారా? అంటూ తులసి ట్వీట్ చేశారు. అమెరికా సైన్యం తరపున ఇరాక్ యుద్ధంలో కూడా తులసి పనిచేశారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తులసికి అవకాశం చాలా తక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా జనాభాలో హిందువులు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారు. అది కూడా భారత్ నుంచి అక్కడికి వెళ్లినవారు కావడం కారణంగా తులసి అధ్యక్ష పీఠంపై కూర్చునే అవకాశం ఉండబోదని వారు తెలిపారు.