పంది మాంసంతో చేసినా..వ్యాక్సిన్లు తీసుకోవచ్చు : యూఏఈ కీలక ప్రకటన

UAE key statement on corona vaccines : కరోనా వైరస్ వ్యాక్సిన్‌లలో పంది మాంసంతో చేసిన జిలాటిన్ ఉన్నా సరే వాటిని ముస్లింలు తీసుకోవచ్చని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశానికి చెందిన యూఏఈ ఫత్వా కౌన్సిల్ స్పష్టం చేసింది. పోర్క్ జిలాటిన్‌ను వ్యాక్సిన్‌లో వాడారన్న వార్తల నేపథ్యంలో చాలా వరకూ ముస్లిం దేశాలు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చన్న వార్తల నేపథ్యంలో ఫత్వా కౌన్సిల్ ఈ కీలక ప్రకటన చేసింది.
ముస్లిం మతాచారాల ప్రకారం పంది మాంసం తీసుకోవడాన్ని హరామ్‌గా భావిస్తారు. మనిషి ప్రాణాన్ని రక్షించేది కావడం వల్ల మరో ప్రత్యామ్నాయం లేకపోతే పోర్క్ జిలాటిన్ ఉన్నా కూడా ఈ వ్యాక్సిన్‌లను తీసుకోవచ్చని కౌన్సిల్ చైర్మన్ షేక్ అబ్దుల్లా బిన్ బయ్యా తెలిపారు. ఈ సందర్భంలో పోర్క్ జిలాటిన్‌ను ఓ ఆహారంగా కాకుండా ఓ ఔషధంగా చూడాలని కూడా కౌన్సిల్ సూచించింది. వ్యాక్సిన్‌లలో పోర్క్‌తో చేసిన జిలాటిన్‌ను కలపడం వల్ల వాటి జీవిత కాలం పెరుగుతుంది.