గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటిస్తే ఏం జరుగుతుంది?

  • Published By: venkaiahnaidu ,Published On : May 1, 2019 / 03:36 PM IST
గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటిస్తే  ఏం జరుగుతుంది?

Updated On : May 1, 2019 / 3:36 PM IST

భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా బుధవారం(మే-1,2019) ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.బ్రిటన్,ఫ్రాస్స్,అమెరికా ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గడంతో మసూద్ ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించడానికి మార్గం సులభమైంది.మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా నిలబెట్టడంతో భారత్‌ పూర్తి విజయం సాధించిందని చెప్పవచ్చు.అయితే ఓ వ్యక్తిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడం వల్ల ఏం జరగుతుందో ఇప్పుడు చూద్దాం..

 1999లో సెక్యూరిటీ కౌన్సిల్ 1267 తీర్మానాన్ని తాలిబాన్లపై ఆంక్షలను విధించేందుకు తీసుకువచ్చింది. కాలక్రమంలో ఇదే తీర్మానాన్ని ఉగ్రనేతలపై ప్రవేశపెట్టారు. ఉగ్రవాదసంస్థలపై కూడా అమలు చేస్తున్నారు. 
1.అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించబడిన వ్యక్తిపై ట్రావెల్ బ్యాన్ ఉంటుంది. ఇతర దేశాలకు ప్రయాణించే అవకాశం కోల్పోతాడు.ఉగ్రవాద సంస్థలను గుర్తిస్తే వీటి సభ్యులు కూడా విదేశీ ప్రయాణాలు చేయలేరు.
2.యునైటెడ్ నేషన్స్ లోని సభ్యదేశాలన్నీ ఈ ఉగ్రవాదికి అందే ఆయుధ సరఫరాను పూర్తిగా నియంత్రించాల్సివుంటుంది. సలహాలు, శిక్షణ, ఆయుధాలను  సరఫరా చేయడం వంటివి సభ్యదేశాలు చేయకూడదు.
3.ఐక్యరాజ్యసమితిలోని సభ్యదేశాల్లో ఈ ఉగ్రవాదికి చెందిన ఆస్తులన్నింటినీ జప్తు చేస్తారు. బ్యాంకుల్లోని నిధులను కూడా సీజ్ చేస్తారు.అంతేకాకుండా ఎక్కడెక్కడి నుంచి నిధులు వస్తున్నాయో ఆ మార్గాలను పూర్తిగా మూసివేస్తారు.

ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు సభ్యదేశంగా పాక్‌ కూడా మసూద్‌ పై కఠిన చర్యలు తీసుకోవాల్సివుంటుంది. అయితే ఏ మేరకు ఐరాస తీర్మానాన్ని పాక్‌ అమలు చేయనుందన్న అంశంపై పలు సందేహాలు నెలకొన్నాయి. ఇప్పటికే పాక్‌లోని లష్కర్‌ తొయిబాను కూడా అంతర్జాతీయ ఉగ్రవాదిగా సంస్థగా ఐరాస ప్రకటించింది. అయితే లష్కర్‌ కట్టడికి పాక్ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్న విషయం తెలిసిందే.