Russian Oil : రష్యాకు అమెరికా బిగ్ షాక్.. ఆయిల్ దిగుమతులపై నిషేధం
యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా దాడులు జరుపుతున్న రష్యాకు(Russian Oil) మరో బిగ్ షాక్ తగిలింది. యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న రష్యాపై ఇప్పటికే..

Russian Oil
Russian Oil : యుక్రెయిన్‌ను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా దాడులు జరుపుతున్న రష్యాకు మరో బిగ్ షాక్ తగిలింది. యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న రష్యాపై ఇప్పటికే పలు ఆర్థికపరమైన ఆంక్షలను విధించిన అగ్రరాజ్యం అమెరికా తాజాగా మరో కీలక ఆంక్షను విధించింది. రష్యా నుంచి అమెరికాకు దిగుమతి అవుతున్న ముడి చమురు(Russian Oil) సహా గ్యాస్, ఇంధనంపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాపై ఒత్తిడి పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
రష్యా నుంచి ముడిచమురు తీసుకోవద్దని అమెరికా, యూరప్ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ ప్రకటన చేశారు. మరోవైపు అమెరికా ప్రకటనకు అనుగుణంగా ఈ ఏడాది చివరి నాటికి రష్యా చమురు దిగుమతులను దశలవారీగా నిలిపివేస్తామని బ్రిటన్ సైతం ప్రకటించింది.
అమెరికా తన చమురు ఎగుమతులను స్వీకరించకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతా ఊహిస్తున్నట్లుగా అమెరికా ఇదే దిశగా నిర్ణయం తీసుకుంది. అది రష్యా ఆర్థిక పతనానికి దారి తీస్తుందన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి.
యుక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యా.. తనపై ఆంక్షలు విధించిన పశ్చిమ దేశాలపై కన్నెర్ర చేసింది. తమ దేశ చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. జర్మనీకి తక్షణమే గ్యాస్ సరఫరా ఆపేస్తామన్న రష్యా.. ముడిచమురు ఉత్పత్తినీ తగ్గిస్తామని స్పష్టం చేసింది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధర 300 డాలర్లకు చేరుతుందని అంచనా.
యుక్రెయిన్‌లో రష్యా తన సైనిక చర్యను ముగించే వరకు తమ సభ్య దేశాల్లో.. రష్యాకు చెందిన స్పుత్నిక్, రష్యా టుడే ప్రసార కార్యకలాపాలను నిలిపివేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించింది. దీంతోపాటు తప్పుడు ప్రచారాలను కట్టడి చేయనుంది. ఈ రష్యా నియంత్రిత సంస్థలు.. పుతిన్ ఉద్దేశాలపై పక్షపాత వార్తలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించింది.
యుక్రెయిన్ పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా 13వ రోజూ రష్యా బలగాలు దాడులు చేశాయి. రష్యా దాడుల్లో యుక్రెయిన్ 10 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది.
యుక్రెయిన్‌పై దాడులను రష్యా తీవ్రతరం చేసింది. ఓవైపు కాల్పుల విరమణ ప్రకటిస్తూనే.. అందుకు విరుద్ధంగా నివాస గృహాలే లక్ష్యంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మృతిచెందినట్లు యుక్రెయిన్ వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. ‘మానవత్వాన్ని మంటగలుపుతూ గత రాత్రి రష్యన్ పైలట్లు సుమీలో మరో నేరానికి పాల్పడ్డారు. నివాస భవనాలపై 500 కిలోల బాంబులు వేశారు. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు సహా 18 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు’ అంటూ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేసింది.