ట్రంప్‌నకు షాక్‌.. హెచ్-1బీ వీసా ఫీజును నిలిపేయాలి.. అప్పట్లో దీనిపై గెలిచిన “చాంబర్‌ ఆఫ్ కామర్స్‌” ఇప్పుడు మళ్లీ కోర్టుకు వెళ్లి..

యూఎస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌ గతంలో కూడా ప్రభుత్వాల వలస, కార్మిక విధానాలపై పలు కేసులు వేసింది. ట్రంప్‌ మొదటి పాలనా కాలంలో హెచ్-1బీ వీసాలపై పరిమితులను సవాలు చేసి విజయవంతమైంది.

ట్రంప్‌నకు షాక్‌.. హెచ్-1బీ వీసా ఫీజును నిలిపేయాలి.. అప్పట్లో దీనిపై గెలిచిన “చాంబర్‌ ఆఫ్ కామర్స్‌” ఇప్పుడు మళ్లీ కోర్టుకు వెళ్లి..

Donald Trump

Updated On : October 17, 2025 / 2:44 PM IST

H-1B visa: హెచ్-1బీ వీసా పిటిషన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం విధించిన కొత్త $100,000 (రూ.87 లక్షలు) ఫీజు చట్టవిరుద్ధమని పేర్కొంటూ కోర్టులో యూఎస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌ సవాలు చేసింది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం.. నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులపై ఆధారపడే అమెరికా కంపెనీలకు ఎదురుబెబ్బలాంటిదని తెలిపింది.

డొనాల్డ్‌ ట్రంప్‌ సెప్టెంబర్‌ 19న ఈ ఫీజును విధించారు. అమెరికాలో విదేశీ ఉద్యోగుల నియామకాలను తగ్గించి, అమెరికా పౌరులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. (H-1B visa)

యూఎస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు నీల్‌ బ్రాడ్లీ ఓ ప్రకటనలో దీనిపై పలు విషయాలు తెలిపారు. కొత్త ఫీజు అమెరికా కంపెనీలకు.. ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు హెచ్-1బీ ప్రోగ్రామ్‌ వినియోగాన్ని కష్టతరం చేస్తుందని హెచ్చరించారు.

“కొత్త $100,000 వీసా ఫీజును ముఖ్యంగా స్టార్టప్‌లు, చిన్న, మధ్య తరహా సంస్థలు, భరించలేవు. హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ ద్వారా అమెరికా కంపెనీలు ప్రపంచంలోని స్కిల్స్‌ను ఉపయోగించుకునే అవకాశం పొందుతాయి” అని బ్రాడ్లీ తెలిపారు. అయితే, ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఫీజును ఒక్కవాయిదాలోనే చెల్లించాలని, ఇది వార్షిక ఛార్జీ కాదని స్పష్టం చేసింది.

చాంబర్‌ అభిప్రాయం

ఈ ఫీజు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌ను (అమెరికా వలస చట్టం) ఉల్లంఘిస్తుందని యూఎస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌ చాంబర్‌ తన లీగల్‌ ఫైలింగ్‌లో పేర్కొంది. ఆ చట్టం ప్రకారం వీసా ఛార్జీలు ప్రభుత్వ పరిపాలనా ఖర్చులను ప్రతిబింబించాలి కానీ ఆదాయ వనరులుగా ఉపయోగించవద్దు.

బ్రాడ్లీ మాట్లాడుతూ.. “హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను అమెరికా ప్రపంచ నైపుణ్యాన్ని ఉపయోగించుకునేందుకు కాంగ్రెస్‌ సృష్టించింది” అని గుర్తు చేశారు. తాము కోర్టులో ఈ కేసును వేసింది వలసల నియంత్రణకు వ్యతిరేకంగా కాదని, ఆర్థిక సమతుల్యత కలిగిన వీసా విధానం కోసం మాత్రమేనని స్పష్టం చేసింది. దేశ సరిహద్దులను కాపాడడంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కృషి చేశారని బ్రాడ్లీ తెలిపారు. అధిక వీసా ఫీజు అమెరికా పోటీతత్వానికి ముప్పు అని పేర్కొంది.

ముఖ్యంగా సాంకేతిక, విజ్ఞాన రంగాల్లో నైపుణ్యాలున్న ఉద్యోగుల కొరత నేపథ్యంలో ఈ చర్య ఆవిష్కరణలకు ఆటంకంగా నిలుస్తుందని హెచ్చరించింది. ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే ఉద్యోగుల సంఖ్య పెరగాలి, తగ్గకూడదు అని బ్రాడ్లీ పేర్కొని, కాంగ్రెస్‌తో కలసి నైపుణ్య ఉద్యోగుల వీసా ప్రక్రియను మెరుగుపరిచే సాధారణ సంస్కరణలు చేపట్టాలని సూచించారు.

యూఎస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌ గతంలో కూడా ప్రభుత్వాల వలస, కార్మిక విధానాలపై పలు కేసులు వేసింది. ట్రంప్‌ మొదటి పాలనా కాలంలో హెచ్-1బీ వీసాలపై పరిమితులను సవాలు చేసి విజయవంతమైంది. 2017 నుంచి అమెరికా వ్యాపార పోటీతత్వాన్ని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలపై 25 కేసులు వేసింది.