అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ట్రంప్, కమలా హారిస్‌లను టెన్షన్ పెడుతున్నది ఏంటి?
అసలేంటి స్వింగ్ స్టేట్స్. అక్కడ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరి వైపు ఎడ్జ్ ఉంది?

US Election 2024 : ఇక కొన్ని గంటలు అంతే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓ కీలక ఘట్టం మొదలు కాబోతోంది. యూఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అంటే.. ప్రపంచం అంతా ఆసక్తే. ట్రంప్ దూకుడు, కమలా కౌంటర్లు ఈసారి ఎన్నికలను మరింత హాట్ గా మార్చాయి. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న వేళ చెత్త వివాదంలో ట్రంప్ ఇరుక్కుంటే.. కమలాకు గాజా టెన్షన్ పట్టుకుంది. మరి ఇద్దరిలో ఎవరిది పైచేయి? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది?
స్వింగ్ స్టేట్స్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ ఈ పదం సరికొత్త చర్చకు దారితీసింది. అసలేంటి స్వింగ్ స్టేట్స్. అక్కడ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరి వైపు ఎడ్జ్ ఉంది? ట్రంప్, కమలా హారిస్ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి? వైట్ హౌస్ కు దారేది అంటూ ఇద్దరు అభ్యర్థులు సంధిస్తున్న వ్యూహాలు ఏంటి? ఓటర్ తీర్పు ఎలా ఉండబోతోంది?
ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య పోటీ రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ట్రంప్ అసమర్థుడని, అధ్యక్ష పదవికి కరెక్ట్ కాదని, ఆయనో నియంత అంటూ కమలా హారిస్ విమర్శలు గుప్పిస్తే.. హారిస్ గెలిస్తే ఆమెను చిన్న పిల్లను చేసి అమెరికాలో జిన్ పింగ్ గేమ్ ఆడుకుంటారని ట్రంప్ సెటైర్లు వేశారు. అటు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చెత్త రాజకీయం నడుస్తోంది. ట్రంప్ చిట్టచివరి భారీ బహిరంగ సభ.. పెద్ద వివాదానికి, జాత్య అహంకార వ్యాఖ్యలకు వేదికైంది.
న్యూయార్క్ మాడిసన్ స్క్కేర్ గార్డెన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో స్టాండప్ కమెడియన్ టోనీ హించ్ క్లిఫ్ పాల్గొన్నాడు. ప్యూర్టోరికోను చెత్త కుప్పతో పోలుస్తూ హించ్ క్లిఫ్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ ను ఇరుకున పెట్టాయి. ప్యూర్టోరికోను చెత్త కుప్పతో పోల్చడంతో అధ్యక్షుడు జో బైడెన్ ఎదురుదాడికి దిగారు. ట్రంప్ మద్దతుదారులంతా చెత్తకుప్పతో సమానం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని ట్రంప్ ఆయుధంగా మార్చుకున్నారు. బైడెన్, హారిస్ లకు కౌంటర్ ఇస్తూ.. ఓ చెత్త ట్రక్ ను నడిపారు. ఈ వ్యవహారం అధ్యక్ష ఎన్నికల్లో కీలకం కాబోతోంది. ప్యూర్టోరికో డైరెక్ట్ ఓటర్లు, ఆ దేశంతో సంబంధం ఉన్న వారు ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ ఫలితాలతో ప్రపంచ రాజకీయాలే మారిపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో ఎవరిపై ఎవరిది పైచేయి అంటూ జోరుగా చర్చ సాగుతోంది. ఇక ఫలితాలపై నిర్వహించిన సర్వేలు మరింత హీట్ పెంచేశాయి. జూలైలో ఎన్నికల బరిలోకి దిగినప్పటి నుంచి దాదాపు అన్ని సర్వేల్లోనూ కమల ముందంజలో ఉన్నారు. అయితే, నెల రోజులుగా ఆమెకు ఓటర్ల నుంచి మద్దతు తగ్గుతూ వస్తోంది. ట్రంప్ పుంజుకుంటున్నారు. పలు సంస్థలు నిర్వహించిన సర్వేలతో ట్రంప్ కంటే కమలా హారిస్ కేవలం ఒక పాయింట్ ముందంజలో మాత్రమే ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య పోరాటం నువ్వా నేనా అన్నట్లుగా కనిపించే ఛాన్స్ ఉంది.
Also Read : ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం..! అమెరికా రియాక్షన్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది?