అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 04:21 AM IST
అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు

Updated On : January 4, 2020 / 4:21 AM IST

ఇరాన్‌ టాప్‌ కమాండర్‌ ఖాసీం సోలెమన్‌ను అమెరికా హతమార్చడంతో ఇరు దేశాల మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరాక్‌లోని తమ పౌరులకు అమెరికా అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతమున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అమెరికా పౌరులు తక్షణమే ఇరాక్‌ వదిలి వెళ్లిపోవాలని బాగ్దాద్‌లోని యూఎస్‌ ఎంబసీ కోరింది. అమెరికా పౌరులు వెంటనే వాయుమార్గం ద్వారా దేశం విడిచి వెళ్లండి. అది సాధ్యం కాకపోతే కనీసం రోడ్డు, రైలు మార్గం ద్వారా అయినా ఇతర దేశాలకు వెళ్లండి’ అని ఎంబసీ ఓ ప్రకటన చేసింది.

ఇరాన్‌ ఖడ్స్‌ ఫోర్స్‌ విభాగాధిపతి జనరల్‌ ఖాసీం సోలెమన్‌ని చంపడాన్ని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడి నేపథ్యంలో ఇరాన్‌ అత్యున్నత భద్రతా విభాగం అప్రమత్తమైంది. వెంటనే సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది.

సోలెమన్‌ మృతి, అమెరికా చర్యపైనే ప్రధానంగా ఈ భేటీలో చర్చించారు. మరోవైపు ఇరాన్‌లో అమెరికా తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న స్విట్జర్లాండ్‌ రాయబారికి ఇరాన్‌ ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. అమెరికా రాకెట్‌ దాడితో మధ్య ఆసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య ఈ సమావేశం జరిగింది.

తీవ్ర ప్రతీకార దాడి తప్పదని సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమనెయ్‌ హెచ్చరించారు. ఖాసీం సేవల్ని కొనియాడిన ఆయన.. మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అమెరికా జరిపిన ఈ దాడిని అతి భయంకరమైన, ఉద్రిక్తతలను పెంచే అవివేకపు చర్యగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి జావద్‌ ఝరీఫ్‌ అభివర్ణించారు.

అమెరికా చర్యకు ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేసింది. అయితే సులేమాని మృతిపై ఇరాక్‌లో మాత్రం హర్షాతిరేకాలు వెల్లువెత్తినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో చెబుతున్నారు. ఇందుకు సంబంధించి తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో కూడా పోస్టు చేశారు. ఆ వీడియోలో కొందరు యువకులు ఇరాక్‌ జాతీయ జెండా పట్టుకుని ఆనందంతో వీధుల్లో పరుగెత్తుతున్నారు.
#IRANWAR #WWIII #Soleimani 
Read More : 18వ రోజు : రాజధాని బంద్