Non Veg Milk: ఏంటీ నాన్ వెజ్ మిల్క్..? ఎందుకింత వివాదంగా మారింది, భారతీయులు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..
భారతదేశ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ.. ఆహార దిగుమతుల విషయంలో వెటర్నరీ సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది.

Non Veg Milk: భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత డెయిరీ మార్కెట్‌లోకి ప్రవేశించాలని అగ్రరాజ్యం ఆశిస్తోంది. ఇండియాలోని పాడి పరిశ్రమ 140 కోట్ల జనాభాకు పాలను అందిస్తుంది. 8 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. దీంతో భారత డెయిరీ సెక్టార్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టింది అగ్రరాజ్యం.
పాడి పరిశ్రమపై దృష్టి పెట్టిన అమెరికా.. నాన్ వెజ్ మిల్క్ ను భారత్ కు పెద్ద ఎత్తున ఎగుమతి చేయాలని ప్రయత్నాలు చేస్తోంది. భారత్ తో జరుపుతున్న ట్రేడ్ డీల్ చర్చల్లో దీన్ని ప్రధాన అజెండాగా చేర్చింది. అయితే, నాన్ వెజ్ మిల్క్ ఎగుమతులను భారత్ గట్టిగా వ్యతిరేకిస్తోంది. దీన్ని తమ దేశంలో దిగుమతి చేసుకోవడానికి అస్సలు అంగీకరించడం లేదు. ఇరు దేశాల మధ్య వ్యవసాయం- డెయిరీ ఉత్పత్తుల విషయంలో జరుగుతున్న వాణిజ్య ఒప్పందాలు “నాన్-వెజ్ మిల్క్” కారణంగా నిలిచిపోయాయి.
అసలు నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటి? ఎందుకింత వివాదంగా మారింది? అమెరికా డెయిరీ ఉత్పత్తులు, ప్రధానంగా నాన్-వెజ్ మిల్క్‌ను భారత్ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది? నాన్ వెజ్ మిల్క్ ఎందుకంత హాట్ టాపిక్ గా మారింది?
నాన్ వెజ్ మిల్క్.. మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటారు. అసలు ఆవులేంటి.. మాంసాహారం తినిపించడం ఏమిటి.. వాటి నుంచి పాలు ఏమిటి అన్నది పెద్ద మిస్టరీగా అనిపించొచ్చు.
క్లియర్ గా చెప్పాలంటే.. మాంసం లేదా రక్తం వంటి జంతు ఆధారిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకునే ఆవులు ఇచ్చే పాలను నాన్-వెజ్ మిల్క్ అంటారు. అమెరికాలో పశువులకు ఇచ్చే దాణాలో జంతు సంబంధ దాణా ఉంటుంది. ఈ జంతు సంబంధ దాణా తిన్నటువంటి పాలను దిగుమతి చేసుకునేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మతపరమైన, సాంస్కృతిక ఆందోళనల కారణంగా నాన్-వెజ్ మిల్క్ దిగుమతిని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
నివేదికల ప్రకారం అమెరికాలో పశువులకు పెట్టే హారంలో జంతు ఉత్పత్తులు కూడా ఉన్నాయి. “పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు, కుక్కల భాగాలను కూడా కలిగి ఉండే ఆహారాన్ని ఆవులకు పెడతారు. ప్రోటీన్ కోసం పంది, గుర్రపు రక్తం.. పశువుల భాగాల నుండి వచ్చే గట్టి కొవ్వును ఆహారంగా పెడతారు” అని సియాటిల్ పోస్ట్-ఇంటెలిజెన్సర్ 2004 నివేదికలో పేర్కొంది. భారత లో మాత్రం అలా జరగదు. ఇక్కడ ఆవులకు సాధారణంగా శాఖాహార ఆహారం మాత్రమే ఇస్తారు.
”అమెరికాలో ఆవులకు మాంసం, రక్తం, పౌల్ట్రీ లిట్టర్ అంటే కోళ్ల ఈకలు, వ్యర్థాల మిశ్రమం, చేపలు ఇతర జంతు ఉత్పత్తులతో కూడిన ఆహారం ఇస్తుంటారు. వాటి నుంచి తీసే పాలను నాన్ వెజ్ మిల్క్ అంటున్నారు. ఈ పాలు భారత్ లోని సాంస్కృతిక, ఆధ్యాత్మిక నమ్మకాలకు విరుద్ధం. మన దేశంలో పాలు కేవలం ఆహారమే కాదు ఆధ్యాత్మిక ఆచారాల్లోనూ కీలక పాత్ర పోషిస్తాయి. దేవతలకు పాలు సమర్పించడం, హోమాలలో నెయ్యి వాడటం వంటి పవిత్ర కార్యక్రమాల్లో ఉపయోగిస్తారు. మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలు ఈ నమ్మకాలకు విరుద్ధంగా ఉందని భారత్ భావిస్తోంది” అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
”మాంసం, రక్తం కలిసి ఆహారం తిన్న ఆవు పాల నుంచి తయారు చేసిన వెన్నను తినడమా.. అంతకంటే దారుణం మరొకటి ఉండదు.. భారతదేశం దానిని ఎప్పటికీ అనుమతించకపోవచ్చు” అని న్యూఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (GTRI)కి చెందిన అజయ్ శ్రీవాస్తవ అన్నారు.
భారతదేశ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ.. ఆహార దిగుమతుల విషయంలో వెటర్నరీ సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది. “పాలను ఇచ్చే జంతువులకు మాంసం లేదా అంతర్గత అవయవాలు, రక్తం, పంది మాంసం లేదా ఎముక నుండి ఉత్పత్తి చేయబడిన దాణాను ఇవ్వకూడదు” అనేది ఈ సర్టిఫికేషన్ లోని ఒక ప్రధాన నిబంధన.
భారత్ లో పెద్ద సంఖ్యలో శాకాహారులు ఉన్నారు. మాంసాహార ఆహారం తినిపించిన ఆవుల నుండి వచ్చే పాలను వినియోగించడం వారి ఆహార ఆచారాలకు, మత విశ్వాసాలకు పూర్తిగా విరుద్ధం. 8.22 బిలియన్ డాలర్ల డెయిరీ ఎగుమతులతో ప్రపంచంలోని ప్రముఖ డెయిరీ ఎగుమతిదారుల్లో అమెరికా ఒకటి. భారత మార్కెట్‌లోకి ఇంకా అడుగు పెట్టలేదు. ఆగస్టు 1, 2025 నాటికి వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గడువు విధించారు.
పాల ఉత్పత్తిలోనే కాదు వినియోగంలోనూ భారత్ అతిపెద్ద దేశం. ఇండియాలోని పాడి పరిశ్రమ 140 కోట్ల జనాభాకు పాలను అందిస్తుంది. 8 కోట్ల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. కేవలం మతపరమైన సాంస్కృతిక అంశాలను చూసి మాత్రమే కాకుండా దేశ ఆర్థిక అంశాలను కూడా పరిశీలించి అమెరికా పాల దిగుమతులను భారత్ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. అమెరికా పాల ఉత్పత్తులను భారత మార్కెట్ లోకి అనుమతిస్తే పాల ధరలు సుమారుగా 15 శాతం తగ్గిపోయి, పాడి రైతులు సుమారుగా 1.03 లక్షల కోట్లు నష్టపోవచ్చని అంచనా.
భారత్ ఆందోళనలపై అమెరికా స్పందన ఏంటి?
భారత్ నుంచి వస్తున్న వ్యతిరేకతపై అమెరికా స్పందించింది. భారత దేశం డిమాండ్లను “అనవసరమైన వాణిజ్య అవరోధం” గా పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద కూడా అమెరికా ఈ విషయాన్ని లేవనెత్తింది. నవంబర్ 2024లో భారత్ అప్ డేట్ చేసిన డెయిరీ సర్టిఫికేషన్ అటువంటి అంశాలను పేర్కొనలేదని తెలిపింది.
భారత పాడి పరిశ్రమ మార్కెట్ లోకి అమెరికా ఎంటర్ అయితే ఏమవుతుంది?
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో అతిపెద్ద దేశం భారత్. అంతేకాదు.. వినియోగంలోనూ అతిపెద్ద దేశం కూడా. దీంతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించాలని అమెరికా కోరుతోంది. అదే జరిగితే దేశీయంగా పాల ధరలు తగ్గుతాయని, రైతుల ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. SBI విశ్లేషణ ప్రకారం, US పాల దిగుమతులను అనుమతిస్తే భారతదేశం ఏటా రూ. 1.03 లక్షల కోట్ల నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది.