అంతరిక్షంలోకి వెళ్లేముందు శుభాంశు శుక్లా విన్న పాట ఏమిటి..? అలాచేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి..?
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు బాలీవుడ్ సినిమా పాటను విన్నారు.

Shubhanshu Shukla
Shubhanshu Shukla Axiom-4 Launch: భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది. ప్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. అయితే, ప్రయోగానికి ముందు శుభాంశు శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు తనకు ఎంతో ఇష్టమైన ఓ పాటను విన్నారు.
శుక్లా ఏ సినిమాలోని పాట విన్నారు..
శుక్లా వ్యోమనౌకలోకి వెళ్లడానికి ముందు బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’ లోని పాటను విన్నారు. గతేడాది ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. ఈ సినిమాలోని వందేమాతరం అనే పాటను శుక్లా విన్నారు. ‘విజయం అనేది ప్రతి భారతీయుడి నరనరాల్లో ఉంటుంది. మన పరాక్రమానికి శత్రువు కూడా సెల్యూట్ చేస్తాడు’’ అంటూ సాగే ఈ పాట దేశభక్తిని రగిలిస్తుంది.
పాట వినడం వల్ల ఉపయోగం ఏమిటి..?
సాధారణంగా వ్యోమగాములు అంతరిక్ష యాత్ర చేపట్టే ముందు వారికి ఇష్టమైన సంగీతం వినడం నాసాలో కొంతకాలంగా ఆనవాయితీగా వస్తుంది. ఎలాంటి కంగారుపడకుండా మిషన్ పై దృష్టి పెట్టేందుకు ఇలా మ్యూజిక్ వింటారు. ఒత్తిడిని తగ్గించేందుకు సంగీతం శక్తిమంతమైన సాధనం అని పలు అధ్యయనాల్లోనూ తేలిన విషయం తెలిసిందే. అందుకే శుభాంశు శుక్లా కూడా తొలిసారి అంతరిక్షయానం చేయబోయే ముందు తనకు ఎంతో ఇష్టమైన వందేమాతరం పాటను మనస్ఫూర్తిగా విన్నారు.
అంతరిక్ష కేంద్రంలో శుక్లా ఎన్నిరోజులు ఉంటారు..
ప్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ లో భారతకాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు ఫాల్కన్ 9రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే, శుభాంశు బృందం వెళ్లిన వ్యోమనౌక గురువారం సాయంత్రం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనుసంధానం అవుతుంది. అప్పటి నుంచి శుక్లా అతని బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో 14రోజులు ఉంటారు.