నిరుపేదలకు ఉచిత వైద్యం చేసే డాక్టర్‌కు కరోనా

  • Published By: srihari ,Published On : May 2, 2020 / 03:23 AM IST
నిరుపేదలకు ఉచిత వైద్యం చేసే డాక్టర్‌కు కరోనా

Updated On : October 31, 2020 / 2:27 PM IST

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. నగరంలో శుక్రవారం రోజున ఐదు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఓ డాక్టర్‌ కూడా కరోనా సోకింది. ఆగాపురా ప్రాంతంలో నివాసముండే ఈ వైద్యుడు విపరీతమైన జ్వరం, తలనొప్పి రావడంతో అపోలో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ కరోనా పాజిటివ్‌ తేలడంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా ఆగాపురా, ఉస్మాన్‌గంజ్‌ ప్రాంతాల్లో ఆయన క్లినిక్‌లు నిర్వహిస్తున్నాడు. వలస కూలీలు, హమాలీలు, పేద ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు.

డాక్టర్‌కు పాజిటివ్‌ రావడంతో ఆయన తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు, వారింట్లో అద్దెకు ఉంటున్న మరో నలుగురిని అధికారులు హోం క్వారంటైన్‌ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్లినిక్‌లు తెరవకుండా ఇంట్లోనే ఉంటున్నారని తెలిపారు. నాంపల్లి మార్కెట్‌కు వెళ్లి వచ్చారని వైద్యుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన క్రైం విభాగంలో పనిచేసే ఓ కానిస్టేబుల్‌కు కూడా కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. ఆయనకు సన్నిహితంగా మెలిగిన పోలీసు సిబ్బంది సహా కుటుంబ సభ్యులు మొత్తం 18 మందిని హోం క్వారంటైన్‌ చేశారు.

గ్రేటర్‌లో ఇప్పటివరకు 151 కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేశారు. అందులో సగానికిపైగా GHMC ఎత్తేసింది. శుక్రవారం మరో 47 కంటైన్మెంట్‌ జోన్లను ఎత్తివేసినట్లు  ప్రకటించింది. ఈ జోన్ల పరిధిలో గత 14 రోజుల నుంచి ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదు. కంటైన్మెంట్‌ పరిధి నుంచి ఎత్తేసినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలను పరిశీలించేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. 

Also Read | వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి