కేంద్రం చేతుల్లోకి విద్యుత్ రంగం.. రాష్ట్రాల అధికారాలకు కత్తెర

దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగంపై పూర్తి అజామాయిషీ కేంద్ర ప్రభుత్వం చెప్పుచేతల్లోకి వెళ్లనుంది. రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఈ రంగాన్ని నిర్వీర్యం చేసేలా తీసుకుంటున్న చర్యలకు అడ్డుకట్ట వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం విద్యుత్ చట్టంలో పలు కీలక సవరణలను తీసుకురానుంది. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేసేలా పలు నిర్ణయాలు తీసుకోనుంది. చట్టంలో తీసుకొస్తున్న మార్పులపై రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకోవాలని నిర్ణయించింది.
కేంద్రం తీసుకొస్తున్న సవరణల్లో రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్, ఇద్దరి సభ్యుల నియామకం అత్యంత ప్రధానమైంది. ఇప్పటివరకు రాష్ట్రాలే నియమిస్తున్నాయి. ఇకపై ఈ నియామకాలు కేంద్రం చేతుల్లోకి వెళ్లనున్నాయి. జాతీయ స్థాయిలో సుప్రీం కోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా కొందరు విద్యుత్ రంగ నిపుణులతో కమిటీని వేస్తారు. ఈ కమిటీ రాష్ట్రాల ఈఆర్ సీ చైర్మన్ లను, సభ్యుల పేర్లను సిఫార్సు చేస్తుంది. ఈ మేరకు కేంద్రమే ఈఆర్ సీ చైర్మన్ లను, సభ్యులనే నియమిస్తుంది.
నియంత్రణ మండలి నిర్వహణ వ్యయాలను రాష్ట్రమే భరించాలి. ఆదేశాలను పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు ప్రకటించే రాయితీలకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఏమాత్రం బాధ్యత వహించవు. ఉచిత విద్యుత్ పారిశ్రామిక రాయితీలు, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్, గృహాలకు అందిస్తున్న రాయితీలకు అయ్యే మొత్తాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. ఇలా చేయటం వల్ల డిస్కమ్ లు బలపడతాయని కేంద్రం భావిస్తోంది. విద్యుత్ ధరలను తగ్గించాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్రం నోటీసులు జారీ చేస్తుండటం, సంస్థలు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు కేంద్రం వద్ద పంచాయితీ పెట్టాయి.
ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే శాశ్వత విధానం ఉండాలని కేంద్రం భావించింది. ఇందుకోసం కేంద్రం పరిధిలో కాంట్రాక్టు ఎన్ ఫోర్స్ మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని కూడా ప్రతిపాదిత విద్యుత్ సవరణ చట్టంలో పేర్కొంది. ఒకసారి ఈ అథారిటీ ఏర్పడ్డాక రాష్ట్రాలు పీపీఏలను పున:సమీక్షించేందుకు ఆస్కారం ఉండదు. కేంద్ర విద్యుత్ చట్టంలో చేసే మరో ముఖ్యమైన సవరణ ఒకే దేశం- ఒకే విద్యుత్ ధర అంటే ఇకపై కరెంటు ధరలను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఇక ఏమాత్రం ఉండదు.
విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లుతున్న ఓటు బ్యాంకు రాజకీయాలకు కోసం కరెంటు ధరలను పెంచకుండా ఉంచటం కుదరదు. ఏఆర్ సీలతో సమావేశమై వాస్తవ ఆదాయ వ్యయాలను కేంద్రమే సమీక్షిస్తుంది. దేశ వ్యాప్తంగా గ్యాస్, పెట్రోలింగ్ ఉత్పత్తుల ధరలను ఒకేవిధంగా ఉండేలా నిర్ధారిస్తున్నట్లుగానే ఒకే దేశం- ఒకే విద్యుత్ ధరను కేంద్రం ఖరారు చేస్తుంది.