ఏకగ్రీవాలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Ap High Court Key Judgment On Local Election
AP High Court:ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏకగ్రీవాలపై ధర్యాప్తు జరిపేందుకు వీల్లేదని స్పష్టం చేసిన హైకోర్టు.. గతంలో ఏకగ్రీవమైన వ్యక్తులకే డిక్లరేషన్ ఇవ్వాలంటూ ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ఉత్తర్వులను పక్కనబెట్టిన హైకోర్టు ఈ మేరకు కీలక తీర్పు వెల్లడించింది.
నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో స్పందించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విచారణకు ఆదేశించారు. ఎస్‌ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో ఎస్‌ఈసీ ఆదేశాలపై గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు.. ఇవాళ తుది తీర్పు వెలువరించింది. నిలిచిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ఫాం-10 ఇచ్చిన స్థానాల్లో విచారణాధికారం ఎస్‌ఈసీకి లేదన్న పిటిషనర్ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. ఎస్‌ఈసీ ఆదేశాలను కొట్టివేసింది.