BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరుకాకుండా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bjp
BJP: హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టులో జరిగిన ప్రధాని మోదీ సభకు హాజరుకాకుండా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బీజేపీ నేతలు.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం కేసీఆర్ డైరెక్షన్‌లోనే బీజేపీ నేతలు, కార్యకర్తలు, యువత సభకు రాకుండా పోలీసులు అడ్డుకునే కుట్ర చేశారు. అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. అయినా, టీఆర్ఎస్ కుట్రలను చేధించి కార్యకర్తలు బేగంపేట సభకు వచ్చారు. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. సభ సక్సెస్ కాకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు పని చేశారు’’ అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.
Modi Speech: ప్రపంచ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భారత్: మోదీ
‘‘రాష్ట్రంలో టీఆర్ఎస్ పతనం ఖాయమైంది. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. మోదీ సభను ఫెయిల్ చేయాలని సీఎం వేసిన ఎత్తుగడ విఫలమైంది. కేసీఆర్.. మీరు సభను విఫలం చేసేందుకు ప్రయత్నించినా, పోలీసులు అనేక ఆంక్షలు విధించినా వాటిని దాటుకుని, కార్యకర్తలు తరలివచ్చి సభను సక్సెస్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. సీఎం అడుగులకు మడుగులొత్తుతూ, రాజ్యాంగం, చట్టాలు, నిబంధనలకు భిన్నంగా వ్యవహరిస్తున్న పోలీసులకు కౌంట్‌డౌన్ మొదలైందనే విషయాన్ని మర్చిపోవద్దని ఆయన హెచ్చరించారు.