Top Headlines : ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు రానున్నారు.

Top Headlines : ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్.. తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేతల పర్యటన

HeadLines

Updated On : November 17, 2023 / 8:38 AM IST

పోలింగ్ ప్రారంభం ..
మధ్యప్రదేశ్‌లో పోలింగ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 230 అసెంబ్లీ స్థానాలకు ఒకేవిడతలో పోలింగ్‌ జరుగుతోంది. అటు ఛత్తీస్‌గఢ్‌లో రెండో దశలో మరో 70 నియోజకవర్గాలకు పోలింగ్‌ షురూ అయ్యింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది.

రెండు పార్టీల మధ్యే పోటీ ..
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎస్పీ, బీఎస్పీ, ఆప్‌ బరిలోఉన్నా.. నామమాత్ర పోటీ ఇచ్చే అవకాశం ఉంది. మరికొన్ని స్థానాల్లో ప్రధాన పార్టీల తిరుగుబాటు అభ్యర్థులుసైతం బరిలో నిలిచారు. రాష్ట్రంలోని 230 స్థానాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 5కోట్ల 60 లక్షల మంది. 22 లక్షల 36వేల మంది యువత తొలిసారి ఓటు వేయనున్నారు.

70 స్థానాల్లో పోలింగ్ ..
ఛత్తీస్‌గఢ్ రెండో విడత ఎన్నికల్లో మొత్తం 958 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు ఈనెల 7న పోలింగ్ జరిగింది, మిగిలిన 70 స్థానాలకు ఇవాళ పోలింగ్‌ జరుగుతోంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీల మధ్యే ప్రధాన పోరు కొనసాగనుంది.

తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేతలు ..
హస్తం పార్టీ హైకమాండ్‌ తెలంగాణపై ఫోకస్‌ పెంచింది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెలంగాణకు క్యూ కడుతోంది. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్నారు.

ఖర్గే పర్యటన ఇలా..
శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి ఖర్గే చేరుకుంటారు. 11 గంటలకు గాంధీ భవన్ చేరుకుంటారు. గంటపాటు టీపీసీసీ మ్యానిఫెస్టో కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగలో పాల్గొంటారు. రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ఖర్గే తిరిగి బెంగళూరు వెళ్తారు.

రాహుల్ పర్యటన ఇలా..
కాంగ్రెస్‌ అగ్రేనేత రాహుల్‌గాంధీ తెలంగాణలో ఐదు నియోజక వర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పినపాకలో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తారు. అనంతరం పినపాక నుంచి హెలికాప్టర్‌లో నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు నర్సంపేటలో ఉంటారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. వరంగల్ ఈస్ట్‌లో సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర చేస్తారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్తారు.

కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల ..
ఆరు గ్యారెంటీలతో తెలంగాణ ప్రజల్ని తమవైపు తిప్పకునే ప్రయత్నాలు ప్రారంభించిన కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు పూర్తిస్థాయి మ్యానిఫెస్టోపై దృష్టి పెట్టింది. ప్రజల్ని ఆకట్టుకునే పథకాలతోపాటు కీలకమై హామీలిచ్చేందుకు సిద్ధమైంది. ఇవాళ హైదరాబాద్‌కు వస్తున్న ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

ధరణి స్థానంలో భూభారతి ..
ఐదు గ్యారెంటీలతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనూ ఆరు హామీలను ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణి స్థానంలో భూభారతి పేరుతో అప్‌గ్రేడ్‌ చేసిన యాప్‌ను తీసుకువస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇవ్వడం, రేషన్‌ డీలర్లకు గౌరవ వేతనంతోపాటు కమీషన్‌పై స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశముంది. రైతులకు ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్‌ చేస్తున్న విమర్శల నేపథ్యంలో దీనిపై కూడా మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవాళ హైదరాబాద్ కు అమిత్ షా..
పోలింగ్‌ డేట్‌ దగ్గర పడుతున్నాకొద్దీ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ కూడా ఓ రేంజ్‌లో పెరుగుతోంది. ఇప్పటికే అగ్రనేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు రానున్నారు. రేపు తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా… బీజేపీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. ఒకే రోజు మూడు బహిరంగ సభల్లో పాల్గోనున్నారు.

రేపు అమిత్ షా పర్యటన ఇలా..
అమిత్ షా పాల్గొనే బహిరంగ సభలకు సకల జనుల సంకల్ప సభగా నామకరణం చేశారు. గద్వాల నియోజకవర్గంలో రేపు ఉదయం 10 గంటలకు సకల జనుల సంకల్ప సభ జరగనుంది. నల్లగొండలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రచార సభ జరుగుతుంది. వరంగల్ తూర్పు నియోజకవర్గం కోటలో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ మూడింట్లోనూ అమిత్‌ షా పాల్గొంటారు. రేపు సాయంత్రం బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది.

19న జేపీ నడ్డా పర్యటన ..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈనెల 19న రాష్ట్రానికి రానున్నారు. ఈనెల 19న చేవెళ్ల, నారాయణపేట్‌లో నడ్డా బహిరంగ సభలు ఉంటాయి. అదేరోజు సాయంత్రం మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోడ్‌ షో ఉంటుంది.

ప్రచారంలో జోరు పెంచిన కేసీఆర్ ..
సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలతో దూసుకుపోతున్నారు. ఇవాళ కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్‌, పరకాల నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

కేటీఆర్ రోడ్ షో..
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఇవాళ హైదరాబాద్‌లో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా రోడ్‌షోలో పాల్గొంటారు. సాయంత్రం 7 గంటలకు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 5లోని జహీరానగర్‌ చౌరస్తాలో రోడ్‌షో జరుగనుంది. వెంకటేశ్వర కాలనీ, జూబ్లీహిల్స్‌ డివిజన్లకు చెందిన ప్రజలను ఉద్దేశించి కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. ఖైరతాబాద్‌లో రోడ్‌షో ముగిసిన తర్వాత.. హిమాయత్‌ నగర్‌లోనూ మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోలో పాల్గొంటారు. హిమాయత్‌నగర్‌, సోమాజిగూడ, ఖైరతాబాద్‌ డివిజన్లకు చెందిన ప్రజలు పాల్గొననున్నారు.

19న ఫైనల్ మ్యాచ్ ..
వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌ ఫైట్‌ ఈనెల 19న భారత్‌, ఆస్ట్రేలియా మధ్య జరుగనుంది. ఇందుకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికకానుంది. లక్షా 32 వేల మంది కెపాసిటి గల ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానంగా రికార్డ్‌కెక్కింది. వరల్డ్‌ బిగ్గెస్ట్ స్టేడియంలో బిగ్గెస్ట్ మ్యాచ్‌ జరగబోతోంది. ఈసారి కప్‌ను ఎవరు కైవసం చేసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది.