కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా

కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాజకీయ నేతలను వణికిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

  • Published By: naveen ,Published On : June 21, 2020 / 03:50 AM IST
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌కు కరోనా

Updated On : June 21, 2020 / 3:50 AM IST

కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాజకీయ నేతలను వణికిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణ రాజకీయ నేతలను వణికిస్తోంది. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారి కాంగ్రెస్ ను తాకింది. కాంగ్రెస్ సీనియర్ నేత‌, మాజీ ఎంపీ వీ హనుమంతరావు (వీహెచ్‌) కరోనా బారిన పడ్డారు. రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు శనివారం(జూన్ 20,2020) నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వీహెచ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సైతం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం వారంతా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వీహెచ్‌ అండగా నిలిచిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ కాలంలో పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన జలదీక్షలో సైతం వీహెచ్‌ పాల్గొన్నారు. 

వీహెచ్ ఎవరెవరిని కలిశారు:
వీహెచ్ కు కరోనా నిర్దారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కాంటాక్ట్ కేసులను గుర్తించే పనిలో పడ్డారు. గడిచిన వారం రోజులుగా ఆయన ఏయే కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఎవరితో కలిసి తిరిగారు అనేదానిపై అధికారులు ఆరా తీసున్నారు. వీహెచ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు కూడా పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.

ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా:
తెలంగాణలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌, బీగాల గణేష్‌ గుప్తాలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం వారంత చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు కరోనా కాంగ్రెస్ పార్టీలోనూ కలకలం రేపుతోంది. వీహెచ్ కు కరోనా అనే విషయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో కలవరం రేపింది. వారిని ఆందోళనకు గురి చేసింది. ప్రస్తుతం వీహెచ్ వయసు 72 సంవత్సరాలు. వయసు పైబడటంతో పలు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీంతో వీహెచ్ కు కరోనా పాజిటివ్ అని తెలిసి కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఆందోళనకు గురయ్యారు.

తెలంగాణలో కరోనా విశ్వరూపం.. ఒకేరోజు 546 కేసులు, ఒక్క హైదరాబాద్‌లోనే 458 కేసులు:
తెలంగాణలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో 546 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం(జూన్ 20,2020) మరో ఐదుగురు కరోనాతో మృతి చెందగా ఇప్పటివరకూ 203 మంది చనిపోయారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటివరకూ మొత్తం 7,072 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన 546 కేసుల్లో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలో 458 కేసులు నమోదు కాగా రంగారెడ్డి జిల్లాలో 50, కరీంనగర్‌లో 13, జనగామలో 10, మేడ్చల్‌లో 6, మహబూబ్ నగర్‌లో 3, వరంగల్ అర్బన్‌లో 2 వరంగల్ రూరల్‌లో 1, ఖమ్మంలో 2, ఆదిలాబాద్‌లో ఒక్క కేసు నమోదైంది. తాజాగా 154 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 53, 757 మందికి పరీక్షలు నిర్వహించగా 46,685 మందికి నెగెటివ్ వచ్చింది. 7,072 మందికి పాజిటివ్ గా తేలింది. ఇందులో 3,363 యాక్టివ్ కేసులు ఉండగా 3,506 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

Read: క్రెడిట్‌ కార్డు లేకున్నా రూ.2లక్షల బిల్లు వచ్చింది, షాక్‌లో బాధితుడు