తెలంగాణాలో కరోనా @ 1,854 : మరో నలుగురు మృతి

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 12:16 AM IST
తెలంగాణాలో కరోనా @ 1,854 : మరో నలుగురు మృతి

Updated On : May 25, 2020 / 12:16 AM IST

తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశంలో విజృంభిస్తోంది. ఇప్పటికే లాక్ డౌన్ కొనసాగుతోంది. కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. కేసులు తగ్గుముఖం పడుతాయని అనుకుంటే..అలాంటి జరగడం లేదు. రోజూ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2020, మే 24వ తేదీ ఆదివారం 41 మందికి వైరస్ సోకింది. ఇందులో GHMC పరిధిలో 23, రంగారెడ్డి జిల్లాలో ఒకరు, వలస జీవులు 11 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఆరుగురికి పాజిటివ్ లక్షణాలున్నట్లు తేలింది.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 1, 854కు చేరుకుంది. ఆదివారం మరో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 53కు పెరిగింది. జగిత్యాలకు చెందిన 75 ఏళ్ల వృద్దుడు ఉన్నారు. మిగిలిన ముగ్గురు హైదరాబాద్ వాసులు. వీరిలో ఓ మహిళ (45) లుకేమియా వ్యాధితో బాధ పడుతున్నారు. మరో మహిళకు 72 ఏళ్ల వయస్సు ఉంది. ఇంకో వృద్దుడు (60) దీర్ఘకాలంగా శ్వాసకోశ ఇన్ ఫెక్షన్ వ్యాధితో బాధ పడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆదివారం మరో 24 మంది డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారు. 

విదేశాల నుంచి వచ్చేవారి క్వారంటైన్‌ విషయంలో సడలింపులు ఇస్తూ కేంద్రం జారీచేసిన నూతన మార్గదర్శకాలపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌  అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోకి అడుగుపెడుతున్న విదేశీయులు ఇకపై ఏడు రోజుల పాటు హోటళ్లు, లాడ్జీలు, ఇతరత్రా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండాలన్నారు.  మరో ఏడు రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని ఐసీఎంఆర్‌ నూతన మార్గదర్శకాలను విడుదల చేసిందని ఈటల తెలిపారు. విదేశాల నుంచి వచ్చేవారిలో గర్భిణులు, కేన్సర్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారు, కుటుంబ సభ్యులు చనిపోయినవారు ఉంటే.. వారిని నేరుగా హోం క్వారంటైన్‌కి తరలించవచ్చని తెలిపారు.

లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో కేసుల సంఖ్య ఎక్కువైందని వైద్యులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ప్రజలు కూడా నిబంధనలు పాటించడం లేదు. గుంపులు గుంపులుగా బయలుదేరుతున్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నగరవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్‌ నిబంధనలను కఠినతరం చేసినప్పటికీ కేసులు పెరిగిపోతున్నాయి.