Cyclone Yaas: యాస్ కల్లోలం.. బంగాల్​లో కుండపోతగా వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను వేగంగా ఉగ్రరూపం దాల్చి అతి తీవ్ర తుఫాన్‌గా మారి బాలసోర్ సమీపంలోని తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

Cyclone Yaas: యాస్ కల్లోలం.. బంగాల్​లో కుండపోతగా వర్షాలు!

Cyclone Yaas

Updated On : May 26, 2021 / 4:28 PM IST

Cyclone Yaas: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్’ తుపాను వేగంగా ఉగ్రరూపం దాల్చి అతి తీవ్ర తుఫాన్‌గా మారి బాలసోర్ సమీపంలోని తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 155 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. వాయువ్య దిశగా కదులుతున్న తుఫాన్ మరో మూడు గంటల్లో పూర్తిగా బలహీనపడుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ తుపాను కారణంగా చాంద్‌బలి ప్రాంతానికి అత్యంత ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

శాస్త్రవేత్తల అంచనాలకు తగ్గట్టుగానే తుపాను అతి తీవ్ర తుపానుగా మారగా తీరందాటే సమయంలో కూడా అల్లకల్లోలం సృష్టించింది. ఇప్పటికే ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ చేయగా జార్ఖండ్, బీహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మంగళవారం నుండి బెంగాల్ లో మొదలైన వర్షాలు కుండపోతగా మారి రాష్ట్రాన్ని ముంచేస్తున్నాయి. దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని నదులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి.

వర్షాల ధాటికి కపిల్​ ముని మందిరం నీట మునిగింది. వర్షాలకు తోడు పెను గాలులు తోడవ్వగా.. స్థానికులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే..బెంగాల్, ఒడిశా రాష్ట్రాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయ్. మన తెలుగు రాష్ట్రాలలో సైతం తుఫాన్ ప్రభావం ఉండొచ్చని భారత వాతావరణ శాఖ ఇప్పటికే సూచించింది. ఇప్పటికే ఏపీలో పెను గాలులు వీస్తుండగా ప్రజలు సైతం బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. యాస్ తుఫాన్ ఏ రేంజ్ లో కల్లోలం సృష్టిస్తోందో అనే భయంలో మూడు రాష్ట్రాలు ఉన్నాయి.

అయితే యాస్ బెంగాల్, ఒడిశాల మధ్యే తీరం దాటనుండటంతో.. ఆ రెండు రాష్ట్రాలకే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో 115 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాల్లో తుఫాన్ బీభత్సంతో నివాసిత ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. అధికారులు 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా తుఫాన్ ప్రభావాన్ని బట్టి అధికారులు చర్యలకు సిద్ధంగా ఉన్నారు.