సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి : హరీశ్ రావు

  • Published By: sreehari ,Published On : December 9, 2020 / 07:34 PM IST
సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి : హరీశ్ రావు

Updated On : December 9, 2020 / 7:47 PM IST

Harish Rao Press Meet on CM KCR Tour : తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎంను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు. గురువారం కేసీఆర్ సిద్దిపేట సహా పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ పర్యటనపై హరీశ్ రావు బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.



వరుసగా ఎన్నికలు, అసెంబ్లీ కార్యక్రమాలు, ఎన్నికల కోడ్, అమల్లో ఉండటంతో సీఎంకు సమయం దొరకపోవడంతో కొంత ఆలస్యమైందని హరీశ్ రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఒక రోజు పాటు పూర్తి సమయాన్ని కేటాయించడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, సిద్దిపేట నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయడానికి కేసీఆర్ రానున్నారని ఆయన తెలిపారు.



ఈ సందర్భంగా సిద్దిపేటలో మొట్టమొదటి టీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రారంభం సిద్దిపేట నుంచే జరిగిందని గుర్తు చేసుకున్నారు. రేపటి పర్యటనలో భాగంగా మొట్టమొదటి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. బుధవారం ఉదయం సీఎం కేసీఆర్ పర్యటన ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఐటీ టవర్స్ నుంచి ప్రారంభం కానుందని చెప్పారు.



హైదరాబాద్ రోడ్ లోని ఎల్బీ ప్రసాద్ ఆస్పత్రి, టూరిజం హోటల్ కు ఎల్బీ ప్రసాద్ మధ్య మూడు ఎకరాల స్థలాన్ని ఐటీ టవర్ కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఈ ఐటీ టవర్స్… మొదటి దశలో 2వేల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించనున్నారు. ఐటీ టవర్స్ నిర్మాణానికి రూ.45 కోట్లను మంజూరు చేశారన్నారు. ఐటీ టవర్ కు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరగనుందని చెప్పారు. ఐటీ టవర్‌లో మూడు కంపెనీలు ఎంఓయూ చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. సిద్దిపేట నిరుద్యోగులకు మంచి శుభవార్త అన్నారు.



అనంతరం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నట్టు హరీశ్ రావు తెలిపారు. మిట్టపల్లిలో గ్రామ రైతు వేదికను కేసీఆర్ ప్రారంభించనున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో రైతు వేదికలను నిర్మిస్తున్నామని, 90శాతం పూర్తయ్యాయనని తెలిపారు. అనంతరం నాల్గో కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. అలాగే ప్రభుత్వ ఆస్పత్రికి కూడా కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సిద్దిపేట కొమటి చెరువును కేసీఆర్ సందర్శించనున్నారు. ఆ తర్వాత డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు.