ఆదాయం పెంచుకోవడానికి : TS RTCలో పార్సిల్, కార్గో సేవలు

తెలంగాణ ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ కారణంగా ఆదాయంలేక అవస్థలు పడుతోన్న ఆర్టీసీ…. ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్శిల్, కార్గో సేవలను ప్రారంభించింది. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులను హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు.
ఆర్టీసీ ఆదాయానికి గండి : –
కోవిడ్-19 లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీ ఆదాయానికి గండిపడింది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండంతో ప్రజలెవరూ బయటకు రావడంలేదు. ఆర్టీసీ సర్వీసులు (హైదరాబాద్ మినహా) నడిపేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చినా… ప్రయాణికులు బస్సులు ఎక్కడం లేదు. దీంతో ఆర్టీసీకి ఆదాయం పెద్దగా రావడం లేదు.
వేగంగా, భద్రంగా, చేరువగా : –
ఆర్టీసీకి ఆదాయం రాకపోవడంతో… దాన్ని పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే కార్గో సర్వీసులను ప్రారంభించింది. పార్శిల్ కొరియర్ సేవల వివరాలు సంస్థలో చేపట్టిన కార్యాచారణ ప్రణాళికలకు సంబంధించిన విషయాలతో రూపొందించిన కరపత్రాన్ని మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. వేగంగా, భద్రంగా, చేరువగా అనే ట్యాగ్‌లైన్‌తో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. కార్గో సేవలను విస్తృతపరిచేందుకు అవసరమైన వ్యూహం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
తొలిదశలో 140 బస్ స్టేషన్లలో : –
తొలిదశలో 140 బస్ స్టేషన్లలో కార్గో బస్సులు ప్రారంభమయ్యాయి. కార్గో సర్వీసులకు సంబంధించిన వివరాలతో కూడిన మొబైల్ యాప్‌ను కూడా ఆర్టీసీ త్వరలోనే తీసుకురానుంది. పార్సిల్, కొరియర్ సర్వీస్‌ల ద్వారా 180 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఆదాయం సాధించాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
తెలంగాణలో కరోనా : –
మరో వైపు తెలంగాణలో కరోనావ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతున్నది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వారం రోజులుగా భారీగా నమోదవుతున్న కోవిడ్ కేసులు.. 2020, జూన్ 19వ తేదీ శుక్రవారం రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.
ఒక్కరోజే ఏకంగా 499మందికి వైరస్ : –
ఒక్కరోజే ఏకంగా 499మందికి వైరస్ సోకింది. ఈ స్థాయిలో తెలంగాణలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 6,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం 2వేల 976 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్య ఆరోగ్యశాఖ తన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. నిన్న కరోనా నుంచి కోలుకున్న 51మందిని డిశ్చిర్జి చేశారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3వేల 352కుచేరింది. ఇక కరోనా మహమ్మారి శుక్రవారం మరో ముగ్గురిని బలితీసుకుంది. దీంతో కరోనా మృతుల సంఖ్య 198కు చేరింది.