Asia Cup: ఆసియా కప్‌లో కోహ్లీకి బెర్త్ ఖాయమా? రోహిత్ శర్మ డౌటే!
ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయి వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.

Asia Cup: ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది. దుబాయి వేదికగా ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. మొత్తం ఆరు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్ -ఏలో భారత్, పాకిస్థాన్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. గ్రూప్ -బి శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు ఉన్నాయి. క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే పాక్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఈ నెల 28న జరగనుంది.
ఇప్పటి వరకు 14సార్లు ఆసియా కప్ టోర్నీ జరిగింది. ఇందులో ఏడు సార్లు ఇండియా ఆసియా కప్ ను కైవసం చేసుకుంది. చివరిగా 2018లో జరిగిన ఆసియా కప్ లో భారత్ విజేతగా నిలిచింది. ఈసారి ఫేవరెట్ జట్టుగా ఇండియా బరిలోకి దిగనుంది. ఇదిలాఉంటే ఆసియా కప్ కు మరికొద్ది రోజుల్లో బీసీసీఐ జట్టును ఎంపిక చేయనుంది. వన్డే జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈసారి ఆసియా కప్ లో రోహిత్ శర్మ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది. ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య జరిగిన 3వ టీ20 మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తూ రిటైర్డ్‌హర్డ్‌గా వెనుదిరిగాడు. వెన్నులో విపరీతమైన నొప్పి రావడంతో ఔట్ కాకుండానే పెవిలియన్ కు వెళ్లాడు. అయితే రోహిత్ గాయంపై బీసీసీఐ ట్వీట్ చేసింది. రోహిత్ శర్మకు గాయమైందని, వెన్ను నొప్పితోకూ బాధపడుతున్నాడని, వైద్య బృందం ఆయనను పరీక్షిస్తోందని బీసీసీఐ పేర్కొంది.
https://twitter.com/JayShah/status/1554422925393924096?cxt=HHwWgMCgrcfatZIrAAAA
ఆసియా కప్ ఈ నెల చివరి నుంచే ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ కు వెన్నునొప్పి నయంకాని పక్షంలో ఆసియా కప్ లో ఆడేది అనుమానమే అని మాజీ క్రికెటర్లు పేర్కొంటున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫామ్ కోల్పోయి జట్టులో ప్లేస్ దొరక్క తంటాలు పడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌లకు కోహ్లీకి బీసీసీఐ అవకాశం కల్పించలేదు. దీనికితోడు త్వరలో జింబ్వాబే జట్టుతో జరిగే సిరీస్ లో కూడా కోహ్లీకి చోటు లభించలేదు. ఈ సారి ఆసియా కప్ కు ప్రకటించే జట్టులో చోటు లభిస్తుందని కోహ్లీ ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రోహిత్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటే కోహ్లీకి బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ ఉన్నప్పటికీ కోహ్లీ కి ఆసియా కప్ లో ఆడేందుకు అవకాశం లభిస్తుందని బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి.