ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి: సీఎం జగన్‌కు లేఖ

  • Published By: srihari ,Published On : May 27, 2020 / 12:00 PM IST
ఏపీలో చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వండి: సీఎం జగన్‌కు లేఖ

Updated On : May 27, 2020 / 12:00 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చేయూతనివ్వాలని నిర్మాతల తెలుగు చలనచిత్ర మండలి సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరింది. ఈ మేరకు ఓ లేఖ రాసింది. తమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, స్టూడియోలు, ల్యాబ్స్, నిర్మాతలకు, ఆర్టిస్టులకు, ఇతర పరిశ్రమ వర్గాలకు హౌసింగ్ కొరకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి జగన్‌ను కోరింది. 

 మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, కార్యదర్శులు టి.ప్రసన్నకుమార్, వడ్లపట్ల మోహన్ సీఎంకు లేఖ రాశారు. జీవో నెం.45 ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సీఎంకు కృతజ్నతలు తెలియచేశారు. చెన్నై నుంచి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చిన సందర్భంగా అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి స్టూడియోలు నిర్మించుకోవడానికి, ల్యాబ్స్ కట్టుకోవడానికి స్ధలాలు ఉదారంగా కేటాయించారని అన్నారు.

నిర్మాతలు, ఆర్టిస్టుల హౌసింగ్ కొరకు కూడా స్ధలాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి సీఎం పరిశ్రమ వర్గాలకు అవసరమైన స్ధలాలను కేటాయించాలని లేఖలో కోరారు. ఇదే లేఖను ఏపీ టెలివిజన్, చిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ టి.విజయకుమార్ రెడ్డికి, ఛైర్మన్ విజయ చందర్‌కు కూడా అందించారు.

Read: రోడ్డు ప్రమాదంలో యువ నటి మృతి, లాక్ డౌన్ సడలించడంతో ఇంటికి వెళ్తుండగా