Today Headlines: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
'ఈ అసాధారణ విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్రసాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే ప్రయాణం కొనసాగుతోంది’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. నిందితులకు కోర్టు షాక్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఎగ్జామినేషన్ కోసం హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో నాంపల్లి న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
పెళ్లికి రావాలని ఆహ్వానం
వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు షర్మిల. తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ వేడుకకు సీఎం రేవంత్ ను ఆహ్వానించారు షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ కు అందజేశారు.
పార్టీని వీడొద్దని బుజ్జగింపులు
టీడీపీకి రాజీనామా చేస్తానంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అధిష్టానం ఆయనతో బుజ్జగింపు చర్యలు చేపట్టింది. మరో ఎంపీ కనకమేడల.. కేశినేని నానితో భేటీ అయ్యారు. పార్టీని వీడొద్దని నానిని బుబ్జగించారు. ఇక తిరువూరు సభకు నాని హాజరవుతారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది.
అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం
సూర్యుడి రహస్యాలను ఛేదించే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్-1 తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ ప్రయోగం విజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలను అభినందించారు. ‘భారత్ మరో మైలురాయిని చేరుకుంది. దేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ ఆదిత్య-ఎల్1 దాని గమ్యస్థానాన్ని చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రల్లో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం. ఈ అసాధారణ విజయం సాధించిన శాస్త్రవేత్తలకు అభినందనలు. మానవాళి ప్రయోజనం కోసం, శాస్త్రసాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకునే ప్రయాణం కొనసాగుతోంది’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు.
ఇది చంద్రబాబు కుట్రే..
కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల చేరికపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని చెప్పారు. అయితే, షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తేల్చి చెప్పారాయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల వ్యాఖ్యానించారు.
10వ తేదీ వరకే అవకాశం..
పెండింగ్ చలాన్స్ కు మంచి స్పందన వస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వ ప్రసాద్ తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకు చలాన్స్ క్లియర్ చేసుకునేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తెలంగాణలో 3 కోట్ల 59 లక్షల చలాన్స్ పెండింగ్ ఉన్నాయని వెల్లడించారు. ఈ రోజువరకు 77 లక్షల చలాన్స్ క్లియర్ అయ్యాయన్నారు. 67 కోట్ల రూపాయలు పెండింగ్ చలాన్ అమౌంట్ కలెక్ట్ అయిందన్నారు.
అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా
అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది.
ఫార్ములా-ఈ రేస్ రద్దు
హైదరాబాద్‌లో వచ్చేనెల 10న జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దయింది. ఈ విషయాన్ని FIA ఫార్ములా-ఈ వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు చెప్పారు.
కేశినేని నానిపై వైసీపీ నేత పీవీపీ విమర్శలు
విజయవాడ ఎంపీ పదవికి, టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో కేశినేని నానిపై వైసీపీ నుంచి పీవీపీ పోటీ చేసి ఓడిన విషయం తెలిసిందే. కేశినేని నాని బెజవాడకే గుదిబండలా తయారయ్యారంటూ పీవీపీ మండిపడ్డారు. టీడీపీ వల్ల కేశినేని నాని పదేళ్లు బండిని లాక్కొచ్చారని విమర్శించారు. కేశినేనాని బ్యాంకులను బాది, ప్రజలను, ఉద్యోగులని పీల్చి పిప్పి చేశారని అన్నారు. ఇకనైనా కేశినేని నాని ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓ మూలన పడి ఉండాలని అన్నారు.
బేగంపేట ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం
బేగంపేట ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొట్టింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి.
నేటి నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సంక్రాంతి సందర్భంగా ఏపీఎస్‌ఆర్టీసీ నేటి నుంచి 14వ తేదీ వరకు, అలాగే, 16 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనుంది. సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
రూ.100 తగ్గిన బంగారం ధర
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న ఇదే సమయానికి రూ.58,100గా ఉండగా, ఇవాళ ఉదయం రూ.100 తగ్గి రూ.58,000గా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 10 గ్రాములకు రూ.63,380గా ఉండగా, నేడు రూ.110 తగ్గి రూ.63,270గా ఉంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేత శంకరన్న దోండ్గే తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో పేదలు, దళితులు, రైతుల కోసం తమ పార్టీ పనిచేస్తుందని అన్నారు.
రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో శుక్రవారం సాయంత్రం భోపాల్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయని, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే అధికారులు చెప్పారు. రైలు నంబర్ 14813, జోధ్‌పూర్-భోపాల్ ఎక్స్‌ప్రెస్ యొక్క రెండు కోచ్‌లు కోట జంక్షన్ యార్డులో పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు
ప్రకాశం జిల్లా కనిగిరి సభలో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రజలు ఐదేళ్లు నరకాన్ని అనుభవించారని చంద్రబాబు అన్నారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలకు అన్నీ మంచి జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీకీ పూర్వ వైభవం రావాలంటే పవన్ కళ్యాణ్ నేనే కాదు మీరంతా కూడా నడుంబిగించాలి అని చంద్రబాబు పిలుపునిచ్చారు. పౌరుషాల గడ్డ ప్రకాశం జిల్లా నుండే ఎన్నికల శంఖారావం మోగించాను అని చెప్పారు. గెలాక్సీ గ్రానైట్ ను పూర్తిగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి అమ్ముకోవాలని చూస్తే దాన్ని అడ్డుకుని కాపాడిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని అన్నారు చంద్రబాబు.