Today Headlines: సిక్సర్లతో విరుచుకుపడిన విరాట్ కోహ్లీ.. వైసీపీ ఎమ్మెల్యేల బలప్రదర్శనకు వేదికగా న్యూఇయర్ వేడుకలు
నియోజకవర్గంలో తన పట్టు ఏ పాటిదో చూపించాలనే ఉద్దేశంతో అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు చంటిబాబు. జగ్గంపేటలో నాలుగు మండలాల కేడర్‌కు విందు ఏర్పాటు చేసి.. బలప్రదర్శనకు దిగారు.

Today Headlines in Telugu at 11PM
81వ సెంచరీ లోడింగ్..!
దక్షిణాఫ్రికా పర్యటనను విజయంతో ముగించాలని టీమ్ఇండియా భావిస్తోంది. మొదటి టెస్టు మ్యాచులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం సన్నద్ధం అవుతోంది. సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాల్సి ఉంటుంది. దాంతో ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన అందరూ నెట్ సెషన్‌లో పాల్గొన్నారు. అందరి కంటే ఎక్కువగా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోహ్లీ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో విరాట్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్‌లో కొట్టిన సిక్స్ అందరిని ఆకట్టుకుంటోంది. ఎడమ చేతి బౌలర్, మరో పేసర్‌ను సైతం కోహ్లీ వదల లేదు. విరాట్ ఇదే ఫామ్‌ను రెండో టెస్టు మ్యాచులోనూ కొనసాగిస్తే మొదటి టెస్టులో మిస్ అయిన 81వ శతకాన్ని అందుకోవడం ఖాయమని ఫ్కాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
గోదారి తీరంలో విందు రాజకీయం
న్యూఇయర్ వేడుకలు కాకినాడ జిల్లా నేతల బలప్రదర్శనకు వేదికగా మారాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కవనే ప్రచారంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకరిద్దరు నేతలు పక్క పార్టీ నేతలతో చర్చిస్తూనే.. ఇంకా అధికారిక ప్రకటన కోసం ఎదరుచూస్తున్నారు. ఈలోగా అసమ్మతి రాజకీయాలకు భిన్నంగా.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో తమ సత్తా ఏంటో చూపాలని నిర్ణయించుకుని అనుచరులతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించారు.
30 మంది అరెస్టు
న్యూఇయర్ వేడుకల వేళ గుంటూరు, చంద్రమౌళినగర్‌లోని మంత్రి విడదల రజిని కొత్త కార్యాలయంపై కొందరు దుండగులు రాళ్ల దాడి చేసిన ఘటనలో పోలీసులు 30 మందిని అరెస్టు చేశారు. నిందితులను వైద్య పరిక్షల నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు.
బైరి నరేశ్ మాట్లాడుతుండగా..
భారత నాస్తిక సమాజం బహిష్కృత నాయకుడు బైరి నరేశ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులపై నుంచి బైరి నరేశ్ కారు దూసుకుపోయింది. ములుగు జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏటూరు నాగారంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బైరి నరేశ్ మూఢ నమ్మకాలను నిర్మూలిస్తానంటూ ప్రసంగించసాగారు. బైరి నరేశ్ మాట్లాడుతుండగా అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. అయ్యప్ప భక్తులు, బైరి నరేశ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సమావేశ స్థలం నుంచి వెళ్తుండగా బైరి నరేశ్ కారు భక్తులపైకి దూసుకువెళ్లింది. పోగు నరసింగరావు అనే అయ్యప్ప భక్తుడి కాలు విరిగింది.
సొంత ప్రయోజనాల కోసమే..
వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను ఆమె వెంటే నడుస్తానంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల సొంత ప్రయోజనాల కోసమే వైసీపీకి రాజీనామా చేశారన్నారు. సీఎంవో నుంచి గతంలో చాలాసార్లు పిలుపు వచ్చినా అక్కడికి రామకృష్ణారెడ్డి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు.
బంగారం స్వాధీనం
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారంను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మూడు వేరువేరు విమానాల్లో దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ప్రయాణీకుల్లో ముగ్గురు ప్రయాణికుల నుంచి బంగారంను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జగన్ కు టీటీడీ వేదాశీర్వచనం
కొత్త ఏడాది సందర్భంగా సీఎం జగన్ కు టీటీడీ అర్చకులు వేదాశీర్వచనాలు అందించారు. స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం, క్యాలెండర్, డైరీని అర్చకులు సీఎం జగన్ కు అందించారు.
భారీ భూకంపం..
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.4గా నమోదైంది. దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
పట్టుబడ్డ ఏఎస్ఐ ..
పల్నాడు జిల్లా దాచేపల్లి పరిధిలో న్యూ ఇయర్ వేడుకల వేళ మద్యం తరలిస్తూ ఏఎస్ఐ పట్టుబడ్డాడు. దాచేపల్లి మండలం పొందుగుల చెక్ పోస్టు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. గురజాల పోలీస్ స్టేషన్ కు చెందిన ఏఎస్ఐ స్టాలిన్ తో పాటు మరో ఇద్దరు తెలంగాణ మద్యం తరలిస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. ముగ్గురిపై పై కేసు నమోదు చేసిన పోలీపులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆర్థిక సంఘం చైర్మన్ గా పనగడియా..
నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియాను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. కేంద్ర ఆర్థిక శాఖలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రిత్విక్ రంజనమ్ పాండేను దీనికి కార్యదర్శిగా నియమిస్తూ ఆదివారం నోటిఫికేషన్ వెలువరించింది.
మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..
హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్ పేట తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది.
మహాద్వార దర్శనాలు ..
కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పు చిలుకూరు బాలాజీ ఆలయంలో నూతన సంవత్సరం మొదటి రోజు మహాద్వారం వద్ద నుంచే భక్తులకు దర్శన సౌకర్యం కల్పించాలని ఆలయ అర్చకులు నిర్ణయించారు. దీంతో సోమవారం బాలాజీ దర్శనానికి 1.30లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. గర్భగుడిలోకి అనుమతిస్తే చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో మహాద్వార (లఘుదర్శనం) నుంచే దర్శనాలు చేపట్టాలని నిర్ణయించారు.
మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు ..
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు కీలక సూచనలు చేశారు. నాకు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ హైదరాబాద్ రావొద్దని కోమటిరెడ్డి సూచించారు. వచ్చేవారంలో నల్లగొండ జిల్లా పర్యటనకు వచ్చి అందర్నీ కలుస్తానని, నాకివ్వడం కోసం బొకేలు, శాలువాలు కొనొద్దని, అవే డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇవ్వాలని సూచించారు.
న్యూ ఇయర్ సంబరాలు..
దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువత కేరింతల నడుమ కొత్త సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. విద్యుద్దీపాలంకరణలు, లేజర్ షోలు, టపాసుల మోతలు.. కేక్ కటింగ్ లతో యువత సందడి చేశారు. 2023కు వీడ్కోలు చెబుతూ.. 2024కు ఘన స్వాగతం పలుకుతూ సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పరస్పరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుకొని సందడి చేశారు.
రోడ్డు ప్రమాదం..
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చెట్టిచర్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బొలేరో – ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురు మరణించారు. మృతులంతా పాపాయిపల్లి గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. రోడ్డు ప్రమాదం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.