వట్టినాగుల పల్లిలో అక్రమ కట్టడాలపై రేవంత్ స్పందించాలి, తనది కాని ఫామ్ హౌస్ ను కేటీఆర్ కు అంటగడుతున్నారు
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గోపన్ పల్లిలో దళితుల భూములు కబ్జా చేశారని

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గోపన్ పల్లిలో దళితుల భూములు కబ్జా చేశారని
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి గోపన్ పల్లిలో దళితుల భూములు కబ్జా చేశారని ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. 111 జీవోను అతిక్రమించి వట్టినాగుల పల్లిలోని సర్వే నెంబర్ 66లో రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు అక్రమ కట్టడాలు కడుతున్నారని బాల్క సుమన్ చెప్పారు. రేవంత్ బంధువులకు, బినామీలకు కూడా ఆస్తులు ఉన్నాయన్నారు. ఎదుటి వాళ్లపై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పని అని బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తీరు దొంగే… దొంగ దొంగ అని అరుస్తున్నట్టు ఉందన్నారు. వట్టినాగుల పల్లిలో అక్రమ కట్టడాలపై రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. ఎవరెవరికి ఫామ్ హౌస్ లు ఉన్నాయో తేలుద్దామన్నారు. రేపటి నుంచి రేవంత్ రెడ్డి భూ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయని చెప్పారు బాల్క సుమన్.
కేటీఆర్‌పై రేవంత్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు: బాల్క సుమన్
మంత్రి కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు. ఎవరెవరికి 111 జీవో పరిధిలో భూములున్నాయో బయట పెడతామని తెలిపారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న భూములు కేటీఆర్‌వి కాదని చెప్పారు. వట్టినాగులపల్లిలో రేవంత్ బంధువుల పేరుపై భూములు ఉన్నాయని సుమన్ చెప్పారు. కేటీఆర్ పై లేనిపోని ఆరోపణలు చేస్తే నీ బండారం బయటపెడతా అంటూ రేవంత్‌ను హెచ్చరించారు బాల్క సుమన్.
బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్:
రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్లకు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. పెయింటర్ గా జీవితం ప్రారంభించిన రేవంత్ ఈ స్థాయికి ఎలా వచ్చారు, కోట్లాది ఆస్తులు ఎలా సంపాదించారో చెప్పాలన్నారు. ఎన్ని అక్రమాలు చేసి ఉంటే ఆ స్థాయికి వచ్చి ఉంటారని అన్నారు. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ అని, ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ నాశనమే అని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పని కూడా ఖతమే అని చెప్పారు. కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులను స్పష్టంగా చెప్పారని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. తనది కాని ఫామ్ హౌస్ ను కేటీఆర్ కు అంటగడుతున్నారని రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు కేటీఆర్ పై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఓ వైపు ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఓ వైపు ఉంటారని కర్నె ప్రభాకర్ అన్నారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన బాధ రేవంత్ లో కొనసాగుతోందన్నారు. డ్రోన్ కెమెరాలు ఉపయోగించిన కేసులో రేవంత్ మరోసారి జైలుకి వెళ్లారని చెప్పారు. 111 జీవో పరిధిలో కాంగ్రెస్ నేతలకు నిర్మాణాలు ఉన్నాయని వీహెచ్ కూడా చెప్పారని గుర్తు చేశారు. జైలుకి వెళ్లి వచ్చిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు మోడల్ గా మారడం శోచనీయం అన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
హైదరాబాద్ శివారు జన్వాడలో మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌస్ నిర్మించారంటూ రేవంత్ రెడ్డి పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన ఎన్జీటీని ఆశ్రయించగా.. శుక్రవారం గ్రీన్ కోర్టు మంత్రి కేటీఆర్‌కు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఈ వ్యవహారంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సంచలనాల కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ పాల్గొన్నారు.