పాపం రైతన్న: దళారులదోపిడి..నడిరోడ్డుపై 10 క్వింటాళ్ల కాలిఫ్లవర్లను రోడ్డుపాలు చేయటంతో..ఎగబడ్డ జనాలు
UP Farmer Dumps 1000 Kilos Of Cauliflower On Road : అందరి కడుపులు నింపే అన్నదాత అంటే అందరికీ లోకువే. రైతన్న పంటలు పండించకపోతే అందరూ పస్తులుండాల్సిందే. కానీ తాను మాత్రం కష్టాల్లో ఉన్నాగానీ..అందరి కడుపులు నింపే అన్నదాత కష్టాలు మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అటు ప్రభుత్వాలు పట్టించుకోవు..పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతు పడే కష్టాలు ఎవరికి తెలుసు? ఓ పక్క పాలకులు పట్టించుకోక..మరోపక్క దళారీల దోపిడీకి గురయ్యే రైతు కష్టాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. పంట పండించాక సరైన ధర రాక..ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని పండించిన పంటను మార్కెట్ యార్డుకు తెస్తే అక్కడ దళారీలో దోపిడీలకు గురయ్యే రైతన్నల గోడు వర్ణనాతీతం..
అటువంటి ఓ రైతు దళారీల దోపిడీ భరించలేక ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రోడ్డు పాలు చేశాడు. కన్నబిడ్డను నడిరోడ్డుమీద వదిలేయాల్సి వస్తే ఆ గుండె కోత ఎలా ఉంటుందో..అలాగే గుండె కోతకు గురయ్యాడా రైతు తాను పండించిన పంటను రోడ్డు పాలు చేస్తూ..
జహానాబాద్ టౌన్‌కు చెందిన మహ్మద్ సలీమ్ అనే వ్యక్తి తన పొలంలో క్యాలీఫ్లవర్ పంట పండించాడు. ఆ పంటను అమ్ముకోవటానికి యుపిలోని పిలిభిత్‌లోని అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ యార్డ్‌కు తీసుకురాగా.. అక్కడి దళారులు కిలో క్యాలీఫ్లవర్ రూ.12నుంచి రూ.14 గా ఉన్న రీటైల్ ధరను.. కేవలం ఒకే ఒక్క రూపాయిగా నిర్ణయించి..అంతే ఇస్తామన్నారు. దీంతో తాను కష్టపడి పండించిన పంటను దోచేద్దామనుకునే దళారీల దారుణానికి మమ్మద్ సలీమ్ ఆవేదన చెందాడు. సలీమ్ ఆ బాధను తట్టుకోలేక తన మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన 10 క్వింటాళ్ల కాలిఫవర్ పంటను నడిరోడ్డుమీద పారవేశాడు. దాన్ని తిరిగి ఇంటికి తీసుకెళ్లే ఖర్చులు కూడా చేతులో లేక అలా చేయాల్సి వచ్చింది.
ఆ పంట పండించడం కోసం, దాన్ని మార్కెట్ కు తరలించడం కోసం ఇప్పటి వరకూ రూ.12,000 ఖర్చు కాగా.. కిలో కాలీఫ్లవర్ ధర రూ.1 గా నిర్ణయించడంతో సలీమ్ భరించలేకపోయాడు. తీవ్ర మనోవేదనకకు గురయ్యాడు. తిరిగి వాటిని ఇంటికి తీసుకొచ్చేంత డబ్బు లేక ఆ పంటనంతా రోడ్డు పాలు చేశాడు. దీంతో రోడ్డు మీద పడిన తాజా క్యాలీఫ్లవర్స్‌ను సొంతం చేసుకోవటానికి జనం ఎగబడ్డారు. ఎవరికి అందినవి వాళ్లు పట్టుకుపోయారు.