ఆన్‌లైన్ అప్పు.. ఆ యువతి ప్రాణాలు తీసింది!

ఆన్‌లైన్ అప్పు.. ఆ యువతి ప్రాణాలు తీసింది!

Updated On : December 17, 2020 / 2:09 PM IST

Online Loan Debt : డబ్బు అవసరం మనిషితో ఎంతపనైనా చేయిస్తుంది. అవసరానికి డబ్బు దొరకలేదని చాలామంది అధిక వడ్డీ అయినా తప్పక అప్పులు చేస్తుంటారు. అప్పు తీసుకుంటారు కానీ, అధిక వడ్డీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. అప్పు తీర్చలేక పరువు పోతుందని భయపడిపోతున్నారు. మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. సిద్దిపేటకు చెందిన ఒక యువతి కూడా వడ్డీ మాఫియాకు భయపడి ప్రాణాలు తీసుకుంది. అవమానం భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. నంగునూరు మండలం రాజగోపాలపేటకు చెందిన యువతి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తోంది. స్థానికంగా ఎగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది.

తన తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. అప్పుల్లో నుంచి ఎలా భయటపడాలో తెలియలేదు. తండ్రిని అప్పుల బాధ నుంచి బయటపడేసేందుకు ఓ ఆన్ లైన్ సంస్థ నుంచి ఆమె రుణాన్ని తీసుకుంది. అందులోనూ అధిక వడ్డీకి.. మరోవైపు కుటుంబ బాధ్యతలు తనపైనే పడ్డాయి. అప్పు అయితే దొరికింది కానీ, గడవులోగా తీర్చడమే కష్టంగా మారింది. తీసుకున్న మొత్తంలో రూ.3 లక్షల అప్పును ఆమె తీర్చలేకపోయింది. సదరు సంస్థ.. యువతి ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించింది. యువతి ఫొటోపై డిఫాల్టర్ ముద్ర వేసింది. ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవాళ్లందరికీ వాట్సాప్ మెసేజ్‌లు పంపింది.

కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికి ఆమె ఫొటోపై అప్పు ఎగ్గొట్టిందనే సమాచారంతో వాట్సాప్ మెసేజ్ పంపింది. మెసేజ్ వచ్చిన వారిలో బంధువులు ఉన్నారు. తన తోటి ఉద్యోగులు ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. బాధిత యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఎవరికీ మొహం చూపించలేకపోయింది. కొన్నాళ్ల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. తీవ్ర మనస్తాపంతో పురుగుల ముందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది.