Vitamin Supplements : విటమిన్ సప్లిమెంట్స్ వైద్యుల ప్రమేయం లేకుండానే వాడేస్తున్నారా?
నిండైన ఆరోగ్యానికి సమతూకంలోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు అవసరం. అయితే వీటిలో ఒకదానిని పెంచి మిగతా వాటిని విస్మరించటం సరికాదు.

Vitamin Supplements
Vitamin Supplements : నీరసంగా ఉంటే మల్టీ విటమిన్ టాబ్లెట్ లను మింగే స్తుంటారు చాలా మంది. సాధారణంగా ఇది అందరికి అలవాటుగా మారిపోయింది. డాక్టర్ ప్రిస్కిప్షన్ తో పనిలేకుండా మందుల షాపుల్లో దొరుకుతాయి కాబట్టి వీటిని ఎక్కవ మొత్తంలో కొని పడేసి అవసరమైనప్పుడు వాడటం వల్ల అప్పటికి నీరసం పోయినట్లు అనిపిస్తుంది. అయితే వాటిని దీర్ఘకాలం పాటు వాడటం వల్ల దుష్ప్రభావం పడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
నిండైన ఆరోగ్యానికి సమతూకంలోని ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్లు అవసరం. అయితే వీటిలో ఒకదానిని పెంచి మిగతా వాటిని విస్మరించటం సరికాదు. అసలు ఈ సప్లిమెంట్లను వైద్యుల ప్రమేయం లేకుండా వాడకూడదు. ఏదైనా వ్యాధి లేదా, సర్జీరీ నుండి కోలుకునే సమయంలో, పోషకాహార లోపంతో బాధపడుతున్నప్పుడో తప్ప వైద్యులు సప్లిమెంట్లను సూచించరు. కానీ ఈ సమస్యలేవీ లేకపోయినా, వాటి అవసరం లేకున్నా, కొందరు సప్లిమెంట్లను వాడేస్తుంటారు. ఇలాంటప్పుడు శరీరానికి వాటి అవసరం ఉందా..లేక అవసరానికి మించి వాటిని శరీరానికి అందిస్తున్నామా అన్న విషయాన్ని ఆలోచించుకోవాలి.
విటమిన్ డి, బి12 లాంటి కొన్ని డైటరీ సప్లిమెంట్లను ఆ విటమిన్ లోపంతో ఉన్న వాళ్లకి మాత్రమే వైద్యులు సూచిస్తారు. కానీ ఆ విటమిను ఉన్న పదార్ధాల్ని కష్టపడి వండి తినేబదులు అవే విటమిన్లను సప్లిమెంట్లను మింగేస్తే శ్రమ తప్పుతుందనుకునే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. కానీ ఇలాంటి ధోరణి ఏమాత్రం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదు. వ్యక్తుల ఆహారపు అలవాట్లు, అవసరాల అధారంగా డైటరీ సప్లిమెంట్లను వైద్యులు సూచిస్తారు. వైద్యులు సూచించిన మోతాదు, కాలపరిమితి మేరకే వాడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అందరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.