Bathukamma 2023 : తొమ్మిది రోజులు, తొమ్మిది రకాల బతుకమ్మలు, నైవేద్యాలు
బతుకమ్మ అంటేనే పూలు, రంగు రంగుల పూలు. పువ్వులతో పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు. ఒక్కోరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.

bathukamma
Bathukamma 2023 : తెలంగాణాలో బతుకమ్మ పండుగను తొమ్మిది రోజులు జరుపుకుంటారు. బతుకమ్మ అంటేనే పూలు, రంగు రంగుల పూలు. పువ్వులతో పాటు తొమ్మిది రకాల నైవేద్యాలు. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఒక్కోరోజు ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు.
బతుకమ్మ నైవేద్యాలు..
మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ : మొదటి రోజు వేడుక అమావాస్య రోజున మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
రెండో రోజు అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో ప్రసాదం తయారు చేసి సమర్పిస్తారు.
నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
ఐదో రోజు అట్ల బతుకమ్మ : అట్లు ప్రసాదంగా సమర్పిస్తారు.
ఆరో రోజు అలిగిన బతుకమ్మ : ఆశ్వయుజ పంచమి రోజున వస్తోంది. నైవేద్యం సమర్పించరు.
ఏడో రోజు వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులను నైవేద్యంగా పెడతారు.
తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ: ఈ రోజు మాత్రం ఐదు రకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరి అన్నం, నువ్వులన్నం పెడతారు.తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.
పల్లె తెలంగాణ సంప్రదాయ వేడుకైన బతుకమ్మ పండుగ. ప్రకృతి ఒడిలో విరిసిన పూలన్నీ తాంబాలంలోకి అంటే పళ్లెంలోకి చేరేసరికి నిండు ముత్తయిదువులా వెలిగిపోతుంది. తంగేడు పూల అంచుతో, గునుగుపూల కొంగుతో, కట్లపూల చెంగుతో చీరకట్టిన గౌరమ్మ.. కొప్పున సీతజడపూలు తురుముకున్నట్టుగా కనువిందు చేస్తుంది. బతుకమ్మను చేర్చి ఆటపాటలతో ఆడిన ఆడబిడ్డలు బతుకమ్మను చెరువులు, కుంటల నీటిలో నిమజ్జనం చేస్తారు.
చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చీకటి పడుతుంది అనగా ఆడబిడ్డలంతరు బతుకమ్మలను తలపై పెట్టుకుని ఊరిలో ఉన్న చెరువులు, కుంటలకు ఊరేగింపుగా బయలుదేరుతారు. రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా వెళుతుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు. మహిళలు అంటేనే భానయమానం..ఇక వారికి తోడు రంగుల పూలతో బతుకమ్మలు తోడైతే ఇక ఆ దృశ్యం మనోహరంగా ఉంటుంది. శ్రావ్యమైన పాటలతో సందడి సందడిగా ఊరేగింపు సాగుతుంది.
ఈ ఊరేగింపు కొనసాగినంత సేపు జానపద గీతాలతో వీధులు మారుమోగుతాయి. జలాశయం చేరుకున్న తరువాత మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తారు. ఆ తరువాత తాము చేసిన పిండి వంటకాలను బంధు,మిత్రులకు పంచిపెడతారు.ఆ తరువాత ఖాళీ తాంబలంతో బతుకమ్మను కీర్తిస్తూ ఆనందంగా ఇంటికి చేరుతారు. ఇలా బతుకమ్మ పండుగ జరిగినన్ని రోజులు సాయంత్రం అయ్యిదంటే చాలు పాటలతో వీధులన్నీ సంగీత మధురిమలను గుర్తుకు తెస్తాయి.