Hair Fall : డెలివరీ తరువాత తల్లికి జుట్టు ఊడిపోతుందా..?
కోల్పోయిన విటమిన్స్ ని తిరిగి పొందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా రాలిన జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది.

After Delivery
Hair Fall : గర్భం దాల్చిన నాటి నుండి స్త్రీ శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. బరువు పెరగడం, కాళ్లవాపులు, చిగుళ్ళ నుండి రక్తం రావడం వంటివి చాలా సహజంగా ఎదురయ్యే సమస్యలు. అయితే డెలివరీ తర్వాత కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యంగా జుట్టు రాలడం. స్త్రీలకు అందాన్ని తెచ్చిపెట్టేది జుట్టు. అయితే డెలవరీ తరువాత జుట్టు ఊడిపోవటం వారిలో ఆందోళన రేకెత్తిస్తుంది.
డెలివరీ తరువాత మహిళల్లో జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో మహిళల్లో జుట్టు వేగంగా పెరుగుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత రాలిపోతుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గటమేనని నిపుణులు చెబుతున్నారు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు మంచి ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. పండ్లు, పాలు వల్ల క్యాల్షియం, విటమిన్స్ అన్ని సంవృద్ధిగా అందుతాయి. ఆ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉండి జుట్టు బాగా పెరుగుతుంది. ఇక ప్రసవం జరిగిన తర్వాత హార్మోన్ల సమతుల్యత లోపించడం వల్ల జుట్టు బాగా రాలిపోతుంది.
కోల్పోయిన విటమిన్స్ ని తిరిగి పొందేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా రాలిన జుట్టు పెరగడానికి అవకాశం ఉంటుంది. బయోటిన్ లోపం వల్ల జుట్టు అధికంగా రాలే అవకాశం ఉంటుంది. అయితే బయోటిన్ ఎక్కువగా ఉండే గుడ్లు, సోయా బీన్స్, నట్స్, స్వీట్ పొటాటో, బాదాం, చిక్కుళ్ళు వంటి వాటిని తీసుకోవటం ద్వారా లభిస్తుంది. విటమిన్ ఎ ఉండే పదార్థాలైన క్యారెట్లు, పాలకూర, పాలు, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్ వంటివి తీసుకోవాలి. దీని వల్ల జుట్టు స్కాల్స్ ని తేమగా ఉంచటంలో సహాయపడే సెబమ్ అనే జిడ్డు పదార్ధాన్ని తయారు చేయటంలో విటమిన్ ఎ ఉపకరిస్తుంది. పొద్దు తిరుగుడు పువ్వు నూనె, ఆలివ్ ఆయిల్, ఆకుకూరల్లో బచ్చలికూర ఇంకా బ్రోకోలి వంటివి ఎక్కువగా తీసుకుంటే విటమిన్ ఇ లభిస్తుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన టోకోఫెరాల్ విటమిన్ ఇ ద్వారా అందుతుంది. నారింజ, నిమ్మ, బత్తాయి వంటి విటమిన్ సి ఆహారపదార్ధాలను తీసుకోవటం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలకు బాగా ఉపయోగపడుతాయి. జింకు లోపించినా జుట్టు రాలిపోతుంది. జింక్ అందించే ఆహారాలైన జీడిపప్పు, బీన్స్, పెరుగు, మరియు గుడ్లు వంటివి తీసుకోవాలి. ఆకు కూరలు, చిలగడదుంపలు, తాజా పండ్లు వంటివి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చేపలు వంటివి ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల రాలిపోయిన జుట్టు తిరిగి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. వైద్యుల సలహాలు తీసుకుని శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన సప్లిమెంట్స్ ను తీసుకోవచ్చు.